రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది: ఎమ్మెల్యే సీతక్క

by Vinod kumar |
రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది: ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, వైరా: తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఏన్కూరు మండలంలోని గంగుల నాచారం గ్రామాలలో ఆదివాసుల ఆరాధ్యదైవమైన కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు మంగళవారం ఎమ్మెల్యే సీతక్క హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆ గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ మూడు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొని.. క్రీడాకారులను అభినందించారు.

హామీలను తుంగలో తొక్కిన కేసీఆర్..

సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు మాయమాటలు, హామీల వర్షం కురిపించి.. గద్దెనెక్కి తర్వాత హామీలను తుంగలో తొక్కాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


జంతువులకు ఇచ్చే విలువ కనీసం మనుషులు కూడా ఇవ్వడం లేదని.. ఫారెస్ట్ భూములలో రైతులు వెళితే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో రైతుల పై కపట ప్రేమ చూపించి, రాజకీయంగా రైతులు వాడుకోవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. యాసంగిలో వరి ధాన్యం వేయొద్దని.. వరి వేస్తే ఉరే అని రైతులను భయభ్రాంతులకు గురి చేశారని గుర్తు చేశారు.

సమ్మక్క సారక్కలపై చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించినందుకు ఆదిలాబాద్ లో తనపై తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని.. అందుకు కొందరు ఆదివాసీలు కూడా మాట్లాడకపోవడం బాధాకరమని.. మన వేలితో మన కళ్ళు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి కుటిల రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలను చిత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వర్ణ నరేందర్, ఎంపీపీ ఆరేం వరలక్ష్మి, సర్పంచులు రాంబాబు, పర్స మల్లేష్, కొణిజర్ల మండల పార్టీ నాయకులు సూరంపల్లి రామారావు, రాంపూడి రోశయ్య, కొమరం భీమ్ స్వచ్ఛంద సంస్థ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed