- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితబంధు @అంబేద్కర్ జయంతి.. నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రుల హడావిడి
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో అత్యంత పెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో హామీ ఇచ్చినా, శంకుస్థాపన జరిగినా ఆ ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. కానీ, గతేడాది పంద్రాగస్టు తెల్లారి ప్రవేశపెట్టిన 'దళితబంధు' పథకం కింద లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ ఘనంగా జరిపింది ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో పోటీపోటీగా దళిత కుటుంబాలకు ఈ పథకం కింద వాహనాలను, యూనిట్లను, చెక్కుల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. అంబేద్కర్ జయంతిని ఇందుకు వేదికగా చేసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు.
ప్రతీ నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దళితబంధు పథకం కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం దళిత కుటుంబాలకు, యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని మొత్తం 76 కుటుంబాలకు ఇవ్వడానికి ఆర్థికశాఖ నుంచి నిధులు కూడా విడుదలయ్యాయి. రాష్ట్రానికి నాలుగు దిక్కులా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో రూ.250 కోట్లను కూడా విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం మీద మార్చి నెల చివరి నాటికి 40 వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని, యూనిట్లను ప్రారంభించుకునే వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సగం లక్ష్యం మాత్రమే పూర్తయింది.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంత్రులు వారి వారి నియోజకవర్గాల్లోని విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. మరికొద్ది మంది దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఇంకొన్ని చోట్ల యూనిట్లను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగాం జిల్లా దేవరుప్పల మండలం చిన్నమడూరు గ్రామంలో రూ.11.76 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందజేశారు.
మంత్రి ఇందకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణ కేంద్రంలో తన నియోజకవర్గ పరిధిలోని 52 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. మరో మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో 1,041 మంది లబ్ధిదారులకు రూ. 94.84 కోట్ల ఖర్చుతో కూడిన 769 వాహనాలను అందజేశారు. దళితబంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.10 లక్షల వస్తున్నందని కొన్ని గ్రామాల్లో పలువురు లబ్ధిదారులు కలిసి ఒక్క యూనిట్‌ను సమకూర్చుకున్నారు. హార్వెస్టర్, జేసీబీ, డంపర్ లాంటివి సమిష్టిగా ఈ పథకం ద్వారా పొందారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పోచంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, క్యాబ్‌లకు సంబంధించిన తాళం చెవులను అందజేశారు.
మంచిర్యాలలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ 74 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద సాయాన్ని అందజేశారు. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వందమంది లబ్ధిదారులకు సాయాన్ని అందజేశారు. ఐదుగురు యువకులు కలిసి సమిష్టిగా డంపర్‌ను కొనుగోలు చేశారు. దాన్ని వారికి అందించారు. సిద్దిపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వ పథకాల కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. గతేడాది హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఉనికిలోకి వచ్చిన ఈ పథకం నత్తనడకన నడుస్తున్నదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని లబ్ధిదారులకు వాహనాలను అందజేయడం గమనార్హం.