'మీకు చేత కాకుంటే అంబానీ, అదానీలకు అధికారం అప్పజెప్పండి'

by Vinod kumar |
మీకు చేత కాకుంటే అంబానీ, అదానీలకు అధికారం అప్పజెప్పండి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : బీజేపీ ప్రభుత్వానికి పరిపాలన చేత కాకుంటే అంబానీ, అదానీలకు అధికారం అప్పగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా.. టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని, ఇప్పటికే వంద సంవత్సరాలకు సరిపడా అబద్ధాలు చెప్పి కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని సరిగా కొనడం లేదని, తాము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ఆధారాలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు చూపితే.. ఆయన ముఖంలో రక్తపు చుక్కలు లేకుండా పోయిందన్నారు. ఇలా ప్రతిసారీ ప్రణాళికాబద్ధంగా అబద్దాలు చెప్పి, ప్రజలను నమ్మించి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విమర్శించారు. 24 గంటల విద్యుత్, ప్రతి ఎకరాకు రూ. పదివేల రైతుబంధుతో పాటు అనేక విధాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. మోడీ ప్రభుత్వం అసూయ, ద్వేషాలతో వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు.


వ్యవసాయరంగ అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నా మన కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. జాతీయ రహదారులు, నౌకలు, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోంది అన్నారు. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో పండిన వరిని కొనుగోలు చేయడానికి రకరకాల కొర్రీలు పెడుతోందని మంత్రి ఆరోపించారు.


మా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పరిపాలన బాగు లేకుంటే ప్రజలు శిక్షిస్తారు.. మీ శాపనార్థాలతో మాకు ఒరిగేది ఏమీ ఉండదు అని మంత్రి స్పష్టం చేశారు. దేశమంతా తిరిగి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed