తమిళనాడు బ్రాండ్‌నేమ్‌గా 'మధన అమ్మ'

by Nagaya |
తమిళనాడు బ్రాండ్‌నేమ్‌గా మధన అమ్మ
X

దిశ, ఫీచర్స్ : తమిళనాడులో నిర్వహించే పెద్ద పెద్ద ఈవెంట్స్, ఫంక్షన్స్ సహా రుచికరమైన మాంసాహార విందులకు కేరాఫ్‌గా నిలుస్తోంది 'మధన'. ఇప్పుడు తమిళవాసులకు ఓ బ్రాండ్ నేమ్‌గా మారిన 'మధన బిర్యానీ' టేస్ట్ క్రెడిట్ మొత్తం ఆమె చేతి మహిమదే. 'మధన అమ్మ'గా పేరొందిన ఈ ట్రాన్స్ మహిళ.. ఇంతటి గౌరవం పొందేందుకు ఏళ్ల తరబడి పోరాడింది. ఆమె వంటమనిషిగా ఎదిగే కొద్దీ, తన క్యాటరింగ్ సర్వీస్‌లో నైపుణ్యంగల ట్రాన్స్ ఉమెన్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. కోయంబత్తూరులో తోటి ట్రాన్స్ మహిళలు సొంతంగా క్యాటరింగ్ వెంచర్లు ప్రారంభించేందుకు శిక్షణ ఇవ్వడం సహా మహానగరంలోని ట్రాన్స్ ఉమెన్ సైన్యానికి తల్లిగా, అమ్మమ్మగా అనేక సేవలందిస్తోంది. సమాజ మూసపద్ధతులను తన బిర్యానీ టేస్ట్‌తో కూలగొట్టిన మధన అమ్మ గురించి మరిన్ని విశేషాలు మీకోసం!

తంజావూరులోని ఓ పేద కుటుంబంలో జన్మించిన మధన, 5వ తరగతి వరకే చదివింది. వయసుతో పాటు తనలో వస్తున్న మార్పులను గుర్తించి, ఇతరులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారోనని ఆందోళన చెందింది. ప్రధానంగా సొంతం కుటుంబం తనను అమ్మాయిగా అర్థం చేసుకోలేదని, అంగీకరించదని గ్రహించి 18 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయింది. పొల్లాచ్చి చేరుకుని తొమ్మిదేళ్లపాటు ఓ ముస్లిం కుటుంబానికి వంటమనిషిగా పనిచేసింది. నాన్ వెజ్, బిర్యానీని అమితంగా ఇష్టపడే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌.. ఆయా వంటలు చేయడంలో ఎక్స్‌పర్ట్స్. వాళ్లదగ్గరే పాకశాస్త్రంలో ఓనమాలు నేర్చుకున్న మధన.. ఆ తర్వాత కోయంబత్తూర్ చేరుకుని తన సొంత బిర్యానీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.

అవమానాలు దాటుకుంటూ :

కోయంబత్తూర్‌లో 'మధన' అంటే ఒక బ్రాండ్ నేమ్‌. కానీ ఈ స్థాయికి చేరుకునేందుకు ఆమె పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కెరీర్ ఆరంభంలో హోటల్ ప్రారంభించేందుకు ఆమె దగ్గర డబ్బుతో పాటు వంట చేసేందుకు ఇల్లు కూడా లేదు. మరోవైపు ప్రజల అసహ్యకర చూపులు, కించపరిచే మాటలతో అవకాశాలు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు, సమాజ ఆమోదం పొందేందుకు దాదాపు పదేళ్లు పట్టింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. జనాలు ఆమె తయారుచేసిన ఫుడ్‌ కోసం పదే పదే అక్కడికి రావడం మొదలుపెట్టారు. క్రమంగా చిన్న చిన్న ఆర్డర్స్ నుంచి 100 లేదా 200 మంది వ్యక్తులతో కూడిన ఈవెంట్స్ కవర్ చేయడం మొదలవగా.. ఆ తర్వాత భారీ ఫంక్షన్స్‌ సహా 10,000 మందికి వంట చేయగల సైన్యంగా విస్తరించింది. ఇలా తనతో పాటు తోటి ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి లభించడంతో జట్టు పెద్దదైంది, డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకుంది. ఒకప్పుడు పెళ్లి మండపాల్లో ఆమెను చూసి ఎగతాళి చేసిన ప్రజలే ఇప్పుడు ఆమెకు సలాం చేస్తున్నారు. నాడు వేలెత్తి చూపిన ఈ జనమే.. నేడు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. గుచ్చిగుచ్చి చూసిన ఆ చూపులే.. ఈ రోజు ఆమెను గౌరవంగా గుర్తిస్తున్నాయి.

లైంగిక వృత్తిని ఎంచుకునేందుకు కారణమిదే..

ప్రస్తుతం మధనమ్మకు వయసు మీదపడటంతో ఈవెంట్స్ నిర్వహణకు ట్రాన్స్ మహిళల బృందాన్ని పంపుతోంది. తన క్యాటరింగ్ వ్యాపారంలో ఆమెకు ఐదుగురు(ఆశ్రితులు) సహాయకులుగా ఉన్నారు. తన పిల్లలను చూస్తుంటే, ఇప్పుడు నెరవేరని కల ఏదీ లేదని చెబుతోంది మధనమ్మ. అంతేకాదు కుటుంబ అంగీకారం, గౌరవం కోసం ఎన్నో ఏళ్లు ఆరాటపడ్డ తనకు ప్రస్తుతం వారి మద్ధతు కూడా ఉందని తెలిపింది. లింగం, లైంగికత, మతం, కులాల ఆధారంగా ప్రజలు వేరు చేయబడే ప్రపంచంలో తన రుచికరమైన బిర్యానీ ద్వారా ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ఇక ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీపై ప్రస్తుతం సమాజంలో అవగాహన పెరుగుతున్నా.. ఇప్పటికీ అంగీకరించని వ్యక్తులు ఉన్నారని.. నేటికీ ట్రాన్స్‌ పీపుల్‌కు ఉద్యోగాలు లేదా ఉండేందుకు చోటు ఇవ్వట్లేదని వాపోయింది. తాను ఇప్పటి వరకు కలిసిన ప్రతీ ట్రాన్స్ వ్యక్తి వెనక ఇలాంటి కథే ఉంటుందని చెప్పిన మధనమ్మ.. వారు బలవంతంగా లైంగిక వృత్తిని ఎంచుకునేందుకు ఇదే కారణమని అభిప్రాయపడింది. అయితే, ఇన్నేళ్ల తన కష్టానికి గౌరవ మర్యాదలతో పాటు అనేక రకాలుగా ప్రతిఫలం దక్కిందని చెప్పింది. వేలాదిమంది తాను వండిన ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారని, ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలని చెప్పుకొచ్చింది.


పదిమంది సొంతం వ్యాపారం పెట్టుకున్నారు

శరీరాకృతి, వ్యవహారశైలి ఆధారంగా మమ్మల్ని ఎగతాళి చేయడం, అవమానించడం మాత్రమే ఈ ప్రజలకు తెలుసు.. కానీ ఎంతమందికి ట్రాన్స్ వ్యక్తుల వ్యక్తిత్వం, వారు పడే అంతర్మథనం గురించి తెలుసు? ఎవరికీ తెలియదు. ట్రాన్స్ కమ్యూనిటీ విషయానికొస్తే.. అక్కడ యంగ్ ట్రాన్స్ పర్సన్స్‌ను దత్తత తీసుకుని, మనకు తెలిసిన నైపుణ్యాలను వారికి నేర్పించే పద్ధతి ఉంది. మా వయసు ఆధారంగా, మేము వారి అమ్మ (అమ్మ) లేదా పత్తి (అమ్మమ్మ) లేదా పెరియ పట్టి (పెద్దమ్మ) అవుతాం. నేను బిర్యానీ వ్యాపారం ప్రారంభించినప్పుడు, కొంతమంది ట్రాన్స్ మహిళలు నాకు సహాయకులుగా చేరారు. మెల్లగా ఆ సంఖ్య పెరిగి ఐదేళ్ల శిక్షణ తర్వాత సొంతంగా వెంచర్లు ప్రారంభించేందుకు ముందుకొచ్చారు. వారిలో కనీసం 10 మంది ఇప్పుడు కోయంబత్తూర్‌లో అగ్రశ్రేణి క్యాటరర్లుగా ఉన్నారు. ఈ విధంగా వేశ్యవృత్తి లేదా భిక్షాటన కోసం ప్రత్యామ్నాయంగా సంపాదించేందుకు, సమాజంలో గౌరవంగా బతికేందుకు వారు ఒక మార్గాన్ని కలిగి ఉన్నారు.

- మధన అమ్మ

Advertisement

Next Story

Most Viewed