మూడేళ్ల గరిష్ఠానికి ఇంధన డిమాండ్!

by Harish |
మూడేళ్ల గరిష్ఠానికి ఇంధన డిమాండ్!
X

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పైగా, గత నెలలోనే ఇంధన ధరలు నాలుగు నెలల తర్వాత రికార్డు స్థాయిలో ఆల్‌టైమ్ హైకి చేరుకున్నాయి. అయినప్పటికీ భారత్‌లో గత ఇంధన డిమాండ్ మూడేళ్ల గరిష్ఠానికి చేరుకోవడం గమనార్హం. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్ అండ్ అనాలసిస్ ప్రకారం.. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి ఇంధన డిమాండ్ 4.2 శాతం పెరిగి 1.94 కోట్ల టన్నులకు చేరుకుంది. ఇది 2019, మార్చి తర్వాత అత్యధికం. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ బయట పడటంతో దేశంలో ఇంధన వినియోగం గణనీయంగా పెరిగింది. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కువగా వాడుతున్న డీజిల్ భారీగా పెరిగింది. ఒక్క మార్చిలోనే డీజిల్ 6.7 శాతం పెరిగి 77 లక్షల టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి.

ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్ బంకుల్లో ముందుగానే నిల్వలు ఉంచుకోవడం తో పాటు వ్యవసాయ రంగంలో అధిక వినియోగం కారణంగా డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. ఇక, ఇదే నెలలో ఎల్‌పీజీ గ్యాస్ డిమాండ్ 9.8 శాతం పెరిగి 24.8 లక్షల టన్నులు గా నమోదైంది. ఇక, మార్చితో ముగిసిన 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇంధన వినియోగం 20 కోట్ల టన్నుల కంటే ఎక్కువ నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇది అత్యధికం. అదే విధంగా గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వాడకం 10.3 శాతం పెరిగి 3 కోట్ల టన్నులకు, డీజిల్ వినియోగం 5.6 శాతం ఎక్కువగా 7 కోట్ల టన్నులకు పైగా అమ్మకాలు నమోదయ్యాయి. గడిచిన మూడేళ్ల కాలంలో ఇవే అత్యధికం. ఇక, విమాన ఇంధన(ఏటీఎఫ్) కోసం డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ కరోనా ముందు కంటే తక్కువగానే ఉంది.

Advertisement

Next Story

Most Viewed