Amazon తమ కంపెనీని నాశనం చేసిందంటున్న ప్రముఖ సంస్థ

by Harish |   ( Updated:2022-04-01 14:20:12.0  )
Amazon తమ కంపెనీని నాశనం చేసిందంటున్న ప్రముఖ సంస్థ
X

న్యూఢిల్లీ: గ్లోబల్ దిగ్గజం ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, దేశీయ రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం మరింత సంక్లిష్టంగా మారుతోంది. కోర్టు బయట ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ఈ వ్యవహారం కోర్టుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ కంపెనీ అమెజాన్ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేసింది. అమెరికా వ్యాపార దిగ్గజం తమ కంపెనీని నాశనం చేసిందని, వివాదాన్ని పరిష్కారం కాకుండా అడ్డుకుంటూ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు విమర్శించింది. దీనికి సంబంధించి శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

ఈ విచారణలో వాదనలు వినిపించిన ఫ్యూచర్ రిటైల్ తరపు హరీశ్ సాల్వె.. రూ. 1,400 కోట్ల విలువైన అమెజాన్-ఫ్యూచర్ ఒప్పందం కోసం అమెజాన్ సంస్థ రూ. 26 వేల కోట్ల విలువైన కంపెనీని నాశనం చేసిందని వాదనలు వినిపించారు. ఈ విషయంలో అమెజాన్ విజయం సాధించిందని, దీనివల్ల ఫ్యూచర్‌తో వ్యాపార భాగస్వామ్యం కోసం ఎవరూ ముందుకు రావడంలేదని వివరించారు. ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ సంస్థ స్వాధీనం చేసుకునే అంశాన్ని ప్రస్తావిస్తూ.. భూములను లీజుకు ఇచ్చిన వ్యాపారులు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తే ఫ్యూచర్ కంపెనీ ఏం చేయగలదని హరీష్ తెలిపారు. ఇప్పటికే 835 స్టోర్లను కోల్పోయామని, ప్రస్తుతం ఫ్యూచర్ రిటైల్‌కు 374 స్టోర్లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడానికి నిరాకరిస్తూ తర్వాత విచారణను ఏప్రిల్ 4 కు వాయిదా వేసింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్ ఆరోపణలను అమెజాన్ సంస్థ వ్యతిరేకించింది. అద్దె చెల్లించేందుకు సొమ్ము లేదంటూ కారణాలు చెప్పడం ఓ వ్యూహంలా ఉందని, రిలయన్స్ సంస్థ 800 స్టోర్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఫ్యూచర్ రిటైల్ అభ్యంతరం చెప్పలేదని ప్రస్తావించింది. అలాగే, మధ్యవర్తిత్వ కోర్టులో ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు ఆస్తులను స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని అమెజాన్ కోర్టును అభ్యర్థించింది.

Advertisement

Next Story