ఆమె రంగుల 'కల' కు చేయూత.. ఫిలిం మేకింగ్‌లో ఫెలోషిప్

by Mahesh |   ( Updated:2022-05-04 11:31:13.0  )
ఆమె రంగుల కల కు చేయూత.. ఫిలిం మేకింగ్‌లో ఫెలోషిప్
X

దిశ, ఫీచర్స్ : రంగుల తెరపై తమ పేరు చూసుకోవాలన్న తలంపుతో ఎంతోమంది మహిళలు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఆశపడతారు. కానీ ఎలా వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎవరి దగ్గర పని చేయాలో తెలియక ఆగిపోతారు. ఈ రంగంలో తక్కువ మంది మహిళలే పనిచేస్తుండటం, రాణించేందుకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో తెలియని గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ పూరిస్తూ ఫిలిం మేకింగ్‌లో జెండర్ డిఫరెన్స్ తగ్గించే లక్ష్యంతో చెన్నైకి చెందిన ఫొటోగ్రఫీ సంస్థలు 'ఫొటో బినాలే', 'స్టూడియో ఏ' సంయుక్తంగా 'కనవు ఫెలోషిప్ ప్రోగ్రామ్' ప్రారంభించాయి.

'కనవు' అంటే 'కల'. సినీ రంగంలో తమ కల నెరవేర్చుకోవాలనే నారీమణులకు పలు విభాగాల్లో ఏడాది పాటు శిక్షణ ఇస్తున్నారు. కాగా ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన ఐదుగురు మహిళలు తొలిసారి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ ఇటీవలే ప్రదర్శితమై మంచి స్పందన అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫెలోషిప్‌ వివరాలతో పాటు ఆ మహిళా దర్శకుల మనోభావాలు, ఇతర విషయాల గురించి తెలుసుకుందాం.



'కనవు' ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫొటోగ్రఫీ, లైటింగ్, స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ మీడియా, వీడియోగ్రఫీ, మార్కెటింగ్ సహా సేల్స్, కంటెంట్ రైటింగ్ వంటి అంశాలు బోధిస్తున్నారు. ఈ శిక్షణకు ఎంపికైన భిన్ననేపథ్యాల మహిళలు విభిన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఫెలో‌షిప్‌లో రాణించిన మహిళా దర్శకులు.. వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలువురు మహిళల జీవితాలను డాక్యుమెంట్ చేసి ఔరా అనిపించారు.

సమాజంలో వితంతువులు ఎదుర్కొన్న వివక్షకు సంబంధించి ప్రత్యక్ష కథనాలతో పాటు దాని చుట్టూ ఉన్న కళంకం, మూఢనమ్మకాలు వంటి అంశాలతో 'వెల్లై మల్లిగై' పేరుతో డాక్యుమెంటరీ తీశాను. ఏదేమైనా మహిళలు విద్య, ఉద్యోగాల్లో పురోగతి సాధించారు. కానీ తమ భర్తలు చనిపోయినప్పుడు మాత్రం తిరోగమన పద్ధతులకు కట్టుబడి ఉండాలని ఆశించడం దురదృష్టకరం. ఈ విషయంలో సమాజంలోనే కాక మహిళల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ డాక్యుమెంటరీకి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కొత్త చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తాను.

ధనశక్తి, ఫిల్మ్‌మేకర్, నమక్కల్

మహిళా శక్తి అసాధారణమైంది. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'వర్క్ ఉమెన్' అనే డాక్యుమెంటరీ తీశాను. ఇందులో భాగంగా శ్మశానవాటికలో పనిచేసే కాటికాపరి, సివిల్ సర్వెంట్, మేకప్ ఆర్టిస్ట్, గృహిణి వంటి భిన్న రంగాల్లో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడాను. మా చిత్రం సదరు మహిళల ప్రయాణాలు, ఆకాంక్షలు, కలలతో పాటు సంబంధిత రంగాల్లో వారు చూడాలనుకుంటున్న మార్పుల గురించి వివరిస్తుంది. మంచి అప్లాజ్ లభించింది. ట్రైనింగ్‌‌లో ఫొటోగ్రఫీపై పట్టు సాధించాను. దీంతో ఫ్రీలాన్స్ ఫొటోగ్రఫీ అసైన్‌మెంట్స్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఓ స్టూడియో పెట్టాలని భావిస్తున్నా.

భువనేశ్వరి, ఫిల్మ్ మేకర్, సేలం

'యాతుమగి' డాక్యుమెంటరీలో దృష్టి లోపమున్న గాయని జ్యోతి కలై, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న డాక్టర్ KS దీప్సూరియ ఇన్‌స్పైరింగ్ లైఫ్ స్టోరీస్ వివరించాను. ప్రత్యేక సామర్థ్యం గల పిల్లలపై తల్లిదండ్రులు మరింత దృష్టి పెడితే వాళ్లు అద్భుతాలు సాధిస్తారని చెప్పేందుకు బోలెడు ఉదాహరణలున్నాయి. అందువల్ల ఎవరు.. ఎవరికీ తీసిపోరు. అందరిలోనూ ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించిన వాడే విజయం సాధిస్తాడన్నది మాత్రమే గుర్తుంచుకోవాలి.

- చాందిని, దర్శకురాలు, తేని

తమిళనాడు, చెంగల్‌పట్టు జిల్లాలోని ఒరగడమ్ గ్రామస్తుల స్థితిగతులపై 'థోస్ ఫోర్ వాల్స్ - 7' X 5' పేరుతో డాక్యుమెంటరీ తీశాను. 150 మందికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, తలుపులు లేవు. మట్టితో నిర్మించిన ఈ ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలీదు. ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తున్న ఈ గ్రామస్థుల పరిస్థితిని వర్ణించలేం. ఈ నేపథ్యంలో అక్కడి పిల్లల భవిష్యత్తు పై కొనసాగుతున్న భయాందోళనల గురించి ఇందులో ఫోకస్ చేశాం. భవిష్యత్తులో ఫోటో, వీడియో డాక్యుమెంటరీల్లో పని చేయాలనుకుంటున్నాను.

మధు ప్రియ, దర్శకురాలు

దాదాపు 40 మంది మహిళలు ఈ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకుంటే ఐదుగురిని ఎంపిక చేశాం. మహిళలు ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక, మానసిక స్థితిగతులను తొలగించడంలో ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. వారి లక్ష్యాలను సాధించడంలో సాయపడటమే మా లక్ష్యం కాగా.. ఈ మహిళలు నిర్మించిన సినిమాలు కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రస్తుతం రెండో ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం సిద్ధమవుతున్నాం. CPB వెబ్‌సైట్‌లో అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 8 వరకు ఛాన్స్ ఉంది. ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి శిక్షణ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా రూపొందించాం.

అమర్ రమేష్, స్టూడియో ఏ వ్యవస్థాపకుడు & గాయత్రి, సీబీపీ కో ఫౌండర్



Advertisement

Next Story

Most Viewed