ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్: గాదరి కిషోర్

by GSrikanth |
ఆ విషయంలో తెలంగాణ నెంబర్ వన్: గాదరి కిషోర్
X

దిశ, తుంగతుర్తి: రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వెల్లడించారు. సోమవారం జరిగిన బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన 'దిశ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. దళితుల ఆత్మగౌరవం, ఆర్థికాభివృద్ధి కోసం దళితబంధు పథకానికి గత ఏడాది వార్షిక బడ్జెట్ వెయ్యి కోట్ల నిధులను కేటాయిస్తే ఈసారి ఏకంగా 17 వేల ఏడు వందల కోట్లకు పెంచడం సాహసోపేత చర్యగా వర్ణించారు. తొలిసారిగా దళితబంధు పథకాన్ని రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, నిజాంసాగర్ చారగొండ మండలాలతో పాటు సూర్యాపేట జిల్లాలోని తన నియోజకవర్గమైన తుంగతుర్తి పరిధిలో ఉన్న తిరుమలగిరి మండలంలో అమలు చేస్తోందని వివరించారు.

వచ్చే ఏడాదిలో రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలనే నిర్ణయం మేరకే 17 వేల 700 కోట్ల నిధులను బడ్జెట్‌లో నిధులు కేటాయించడం చరిత్రకే రికార్డుగా నిలిచిందని అన్నారు. ఇదిలా ఉంటే సొంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా నేత కార్మికులకు బీమా, విద్య, అటవీ విశ్వవిద్యాలయం, వైద్యం, రైతు సంక్షేమం, రోడ్లు, వృద్ధాప్య పింఛన్ల వయసు తగ్గింపు, నీటిపారుదల, తదితర రంగాలకి ప్రస్తుత బడ్జెట్ ఒక వరంలా మారిందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలకే తప్ప వారితో ప్రజా సంక్షేమానికి ఒరిగేదేమీ లేదని కిషోర్ దుయ్యబట్టారు. విమర్శలు మాని తమతో అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులు వేయాలని సూచించారు.

Advertisement

Next Story