స్వీట్‌నర్లతో క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

by Javid Pasha |
స్వీట్‌నర్లతో క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనాభా కృత్రిమ స్వీట్‌నర్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. తక్కువ కేలరీలను కలిగిఉండటం వల్ల బరువు తగ్గడంలో సాయపడతాయనే భావనతో ఫుడ్, డ్రింక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందులో కొంత నిజమున్నా.. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

1970'sలో అమెరికాలో విక్రయించిన 'సైక్లెమేట్' అనే కృత్రిమ స్వీట్‌నర్లు ఎలుకల్లో మూత్రాశయ క్యాన్సర్‌ను పెంచుతుందని వెల్లడైంది. కానీ మానవ శరీర ధర్మం ఎలుకల కంటే భిన్నంగా ఉంటుందనేది వైద్యులు వాదన. అయినప్పటికీ మీడియా మాత్రం స్వీట్‌నర్లు, క్యాన్సర్‌కు మధ్య సంబంధంపై రిపోర్టింగ్ కొనసాగిస్తూనే ఉంది.


ఈ నేపథ్యంలోనే న్యూట్రిషనల్ ఎపిడెమియాలజీ రీసెర్చ్ టీమ్ 1,02,865 వ్యక్తులపై ఓ అధ్యయనం చేపట్టింది. ఆయా వ్యక్తుల వయసు, లింగం, శారీరక శ్రమ, ధూమపానం, బాడీ మాస్ ఇండెక్స్, ఎత్తు, బరువు, మధుమేహంతో పాటు వైద్య చరిత్ర, కుటుంబ చరిత్రకు సంబంధించిన డేటాను విశ్లేషించింది.

8 ఏళ్లకు పైగా కొనసాగిన ఈ అధ్యయనంలో 'అస్పర్టమే, ఎసిసల్ఫేమ్ K' వంటి స్వీట్‌నర్లు క్యాన్సర్ ముప్పును పెంచుతాయని తేలింది. దీంతో కొన్ని రకాల స్వీట్‌నర్లు తీసుకోకుంటే ఆ ముప్పును నిరోధించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


క్యాన్సర్ ప్రమాదం :

మనం తీసుకునే చాలా వరకు ఆహారాలు, పానీయాల్లో స్వీట్‌నర్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి కొందరు నేచురల్ స్టెవియా లేదా యాకాన్ సిరప్ వంటివి ఉపయోగిస్తే, మరికొందరు అస్పర్టమే వంటి ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు వాడతారు. అయితే మనం తీసుకున్న 'అస్పర్టమే' కడుపులో జీర్ణం కాగానే ఫార్మాల్డిహైడ్ (కార్సినోజెన్)గా మారుతుంది.

ఇది కణాల్లో పేరుకుపోయి క్యాన్సర్‌గా మారేందుకు కారణమవుతుంది. ఇక సుక్రోలోజ్, సాచరిన్‌తో సహా ఇతర స్వీటెనర్స్ వల్ల DNA దెబ్బతింటుందని, క్రమంగా ఇది క్యాన్సర్‌కు దారితీస్తుందని పరిశోధకులు నివేదించారు. అంతేకాదు స్వీట్‌నర్లు మన ప్రేగుల్లోని బ్యాక్టీరియాపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed