బాంబ్ పేల్చిన నటుడు శివాజీ.. వైసీపీ నుంచి ఆ నేతలు జంప్

by Nagaya |
బాంబ్ పేల్చిన నటుడు శివాజీ.. వైసీపీ నుంచి ఆ నేతలు జంప్
X

దిశ, ఏపీ బ్యూరో : ఆపరేషన్ గరుడ పేరుతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సినీనటుడు శివాజీ ఈసారి రూటు మార్చారు. అధికార పార్టీలో బాంబు పేల్చేలా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 9మంది ఎంపీలు, 49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలతో టచ్‌లో ఉన్నారంటూ కుండబద్దలు కొట్టారు. రాబోయే రోజులు వైసీపీకి గడ్డు రోజులని శివాజీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.50వేలు ఇచ్చినా వైసీపీ గెలిచే పరిస్థితి లేదంటూ తేల్చి చెప్పేశారు. గుంటూరు జిల్లా మందడంలో అమరావతి రైతులు నిర్వహించిన విజయోత్సవ సభలో సినీనటుడు శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను సాధిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ నేడు సీఎం అయ్యాక హోదాపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయని శివాజీ అన్నారు. కేంద్రానికి మెజార్టీ ఉంది కదా అని రాష్ట్రానికి రావాల్సిన హక్కులను వదిలేస్తారా అంటూ శివాజీ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా సాధన విషయంలో సీఎం జగన్ ఏం చెప్తారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంటారని సినీనటుడు శివాజీ చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీయాలని సూచించారు.

జగన్ మనసు మార్చుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతియే రాజధాని అని తాను ఆది నుంచి చెప్పుకొస్తున్నాని అది నిజమని నిరూపితమైందని సినీనటుడు శివాజీ చెప్పుకొచ్చారు. అమరావతియే రాష్ట్రరాజధానిగా అటు కేంద్రం ఇటు న్యాయస్థానాలు గుర్తించాయని కానీ జగన్ మాత్రం గుర్తించడం లేదని విమర్శించారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. అమరావతి విషయంలో కుల ప్రస్తావన తీసుకువచ్చారని...ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలే రాజకీయాలను కలుషితం చేస్తున్నారనీ చెప్పుకొచ్చారు. వ్యాపార వేత్తలు రాజకీయాలకు దూరంగా ఉంటే ఈ దేశానికి ఎలాంటి సమస్యలు రావని ప్రజలంతా సంతోషంగా ఉంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన, టీడీపీలకు రాష్ట్ర భవిష్యత్ పట్టదా

కోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ మనసు మార్చుకోవాలని శివాజీ హితవు పలికారు. అమరావతి రాష్ట్ర భవిష్యత్‌కు చాలా ముఖ్యమని... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్రం అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ రాజధాని విషయంలో పోరాడేందుకు కలిసి రావాలని.. అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ప్రజా వేదికను కూల్చిన రోజే ప్రజలు ప్రశ్నించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. అమరావతి ఉద్యమ స్ఫూర్తితోనైనా ప్రజలంతా కలిసి రావాలని సూచించారు.

జనసేన పార్టీ, టీడీపీలకు రాష్ట్ర భవిష్యత్ గురించి పట్టదా అంటూ శివాజీ ప్రశ్నించారు. ప్రతిసారి కోర్టుల జోక్యం కుదరదని అయితే ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత విపక్షాలకు ఉందని శివాజీ గుర్తు చేశారు. మూడు రాజధానుల నిర్ణయం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని శివాజీ చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోందని... మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని శివాజీ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed