TS: ఓటర్ల జాబితా విడుదల.. రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయంటే?

by GSrikanth |
TS: ఓటర్ల జాబితా విడుదల.. రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళలు ఎక్కువగా ఉండడం రాష్ర్ట చరిత్రలో ఇదే మొదటిసారి. అక్టోబరు 31 వరకు మొత్తం 35.73 లక్షల మంది కొత్త ఓటరు దరఖాస్తులు వచ్చాయి. చనిపోయినవారి పేర్లను తొలగించడానికి వచ్చిన దరఖాస్తులు దాదాపు 9.48 లక్షలు ఉన్నాయని వివరించింది. మరో 16.29 లక్షల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు, రాష్ట్రంలోనే ఒక చోటి నుంచి మరో చోటకు మార్చుకున్నవారు ఉన్నారని, వాటన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత మొత్తం ఓటర్ల సంఖ్య 3.26 కోట్లుగా తేలిందని ఆ ప్రకటనలో వివరించింది.

తుది జాబితా ప్రకారం సుమారు 4.40 లక్షల మంది 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, 5.06 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుగా ఉన్నట్లు తెలిపింది. ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వీస్ ఓటర్లతో పాటు సూపర్ సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు అవకాశం కల్పించడంతో నవంబరు 10వ తేదీనాటికి 31,551 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అధికంగా సిద్దిపేట సెగ్మెంట్ నుంచి 757, అతి తక్కువగా మక్తల్ నుంచి కేవలం 5 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నది. ఈ ఏడాది జనవరి 5న రిలీజ్ చేసిన ఫస్ట్ ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లలో 992 మాత్రమే మహిళలు ఉంటే ఇప్పుడు అది 1000.2కు పెరిగిందని వివరించింది.




Advertisement

Next Story

Most Viewed