రాములన్నను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
రాములన్నను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వైరా: వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ను మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్‌కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని ప్రశంసించారు. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు రూ.250 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం శనివారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాములు నాయక్ మానవతావాదని ప్రశంసించారు. రాములు నాయక్ వైరా ప్రజల మనసు గెలుచుకున్నారని కొనియాడారు. కొన్ని కారణాల వల్ల వైరా టికెట్‌ను మదన్ లాల్‌కు కేటాయించామని వివరించారు. తనకు టికెట్టు పదవులు ఏవీ శాశ్వతం కాదని, గిరిజనులకు ప్రభుత్వం 10% రిజర్వేషన్ అమలు చేయటం చారిత్రాత్మకమని రాములు నాయక్ పలుసార్లు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు.

రాములన్న లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. పదవి త్యాగం చేయాల్సి వచ్చినా ఇంత హుందాగా పార్టీ కోసం సేవ చేయటం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పదవి అనేది తనకు ఎండు గడ్డితో సమానమని, తనపై కేటీఆర్ ప్రేమ ఉంటే చాలని రాముల నాయక్ ప్రకటించటం ఆయన హుందాతనాన్ని తెలియజేస్తుందన్నారు. రాములు నాయక్ దయతో, సహకారంతో మదన్ లాల్ వైరా ఎమ్మెల్యేగా గెలుస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాములన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, బ్రహ్మాండంగా కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed