అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంటే సైకిల్ బెల్ అనుకోని సైడ్ ఇవ్వద్దు : కేటీఆర్

by Nagaya |
అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంటే సైకిల్ బెల్ అనుకోని సైడ్ ఇవ్వద్దు : కేటీఆర్
X

దిశ, కామారెడ్డి : ‘‘అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడుతుంటే సైకిల్ బెల్ అనుకోని సైడ్ ఇవ్వాలని చూడొద్దు. స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయనను కాదనుకొని ఇతర మార్గాల వైపు చూడొద్దు’’అని మంత్రి కేటీఆర్ కామారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వస్తే ఆయన వెంట ఎన్నో వస్తాయని, ఆయనను గెలిపించుకునే బాధ్యత మీపై ఉందన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్డు షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇక్కడి భూములకు సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు. కానీ కొంతమంది ప్రత్యర్ధులు కేసీఆర్ వస్తే ఇక్కడి భూములు లాక్కుంటారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఇక్కడి భూముల్లో ఏవైనా లంకె బిందెలు ఉన్నాయా అని వారిని ప్రశ్నించారు.

కామారెడ్డి భూములు సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాలను తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. కేసీఆర్ గెలిస్తే ఎన్నో వ్యాపార వాణిజ్య సంస్థలతోపాటు విద్యాసంస్థలు కూడా వస్తాయన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే లాభం లేదన్నారు. అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌కు ఓటు వేయాలని, మిగతా వారికి ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరులా అవుతుందన్నారు. సన్నాసులకు ఓట్లు వేస్తే మన బతుకులు ఆగం అవుతాయన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీలు చుట్టే కార్మికులు ఉన్నారని, ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ఇక్కడి బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఏ ఒక్కరూ కూడా కోరలేదని, కేసీఆర్ స్వయంగా బీడీ కార్మికుల బతుకుల గురించి ఆలోచించి పెన్షన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్లలో ఉన్న కటాఫ్ డేట్‌ను ఎత్తివేసి బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. అంతేకాకుండా అత్తా కోడళ్లకు కూడా పెన్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదన్నారు. తాను గెలవగానే జన్ ధన్ ఖాతాలు తెరవండి... అందులో 15 లక్షల రూపాయల డబ్బులు ధనా ధన్ వేస్తానని పేర్కొని ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదని గుర్తు చేశారు. పైగా అతనికి ఓటు వేయడం వల్ల నాలుగు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1200 రూపాయలకు పెంచాడని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 400 రూపాయలకే సిలిండర్ను అందజేయనున్నట్లు తెలిపారు. కులం, మతాలు తిండి పెట్టవన్నారు. కానీ వీటిని ఆ రెండు పార్టీలు ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు. అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇస్తున్న రైతు బీమాను కేసీఆర్ గెలిచాక తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేలా చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అంతేగాకుండా పట్టణంలోనీ మహిళా సంఘాలకు వార్డుకో సంఘ భవనాన్ని నిర్మించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసైన్మెంట్ భూములకు పట్టాలివ్వనున్నట్లు తెలిపారు. ఎవరెవరో చెప్పారని ఆగం కావద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు షోలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story