ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఆ సీట్లు వారికే ఇవ్వాలని ప్రపోజల్!

by GSrikanth |
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఆ సీట్లు వారికే ఇవ్వాలని ప్రపోజల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాసిన కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఫస్ట్ సెషన్‌లోనే ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని పార్లమెంటు స్పెషల్ సెషన్‌లో ప్రస్తావించి బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత జూన్ 2014లో జరిగిన మొదటి సెషన్‌లో మహిళా రిజర్వేషన్‌పై చేసిన తీర్మానంలో పరోక్షంగా ఒక షరతు ఉన్నది. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూనే దానికి అనుగుణంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచాలని ఆ తీర్మానంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సీట్లను పెంచాకే అంటూ..

‘అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల సంఖ్యను 33% మేర పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.. అలా పెరిగిన సీట్లను మహిళలకు రిజర్వు చేయాలి... వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేస్తున్నది.’ అని తీర్మానంలో ఉన్నది.

ఇప్పుడున్న సీట్లలోనే 33% రిజర్వేషన్ ద్వారా మహిళలకు కేటాయించాలన్న స్పష్టత ఇవ్వలేదు. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్యను 33% మేర పెంచి అలా పెరిగిన సీట్లనే మహిళలకు ఇవ్వాలన్నది ఆ తీర్మానం సారంశంగా వ్యక్తమైంది. ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి అవసరమైన నిశ్చిత కార్యాచరణ మొదలుపెట్టాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. ఈ తీర్మానంలో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను పెంచాలని ప్రతిపాదించిన రాష్ట్రం.. ఇప్పుడున్న సీట్లలోనే ఇవ్వాలనే అంశాన్ని నొక్కిచెప్పకపోవడం గమనార్హం.

కవిత, కేసీఆర్ లేఖలు..

ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో మార్చి 10న ధర్నా చేసి పలు పార్టీల మద్దతు కోసం ప్రయత్నించారు. కేంద్రంమీద ఒత్తిడి తేవడంతో పాటు బిల్లు ఆమోదం పొందేలా సహకరించాలని గత వారం 47 పార్టీల నేతలకు ఆమె లేఖలు రాశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంటు స్పెషల్ సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలంటూ ప్రధానికి లేఖ రాశారు. ఓబీసీలకు సైతం 33% సీట్లను రిజర్వు చేయాలని మరో లేఖలో పేర్కొన్న కేసీఆర్ ఈ స్ఫూర్తిని 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అటు మహిళల విషయంలో, ఇటు ఓబీసీల విషయంలో టికెట్ల కేటాయింపులో ప్రదర్శించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed