అంతా మా ఇష్టం.. అడిగినంత ఇవ్వకుంటే అన్నీ గైర్హాజరులే

by Javid Pasha |
అంతా మా ఇష్టం.. అడిగినంత ఇవ్వకుంటే అన్నీ గైర్హాజరులే
X

దిశ, సిటీబ్యూరో : మహానగరంలో మహిళల రక్షణ కోసం అనేక ఆధునిక సంస్కరణలను అమలు చేస్తున్నా, జీహెచ్ఎంసీలో మాత్రం మహిళా స్వీపర్లకు భద్రత కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శానిటేషన్ విభాగంలో తరుచూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎస్ఎఫ్ఏలను ర్యాండమ్‌గా బదిలీలు చేసినా, వారి చేతిలోని అటెండెన్స్ మిషన్ మార్చినా, వారి ఆగడాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. కుటుంబ పోషణ కోసం స్వీపర్లుగా పని చేస్తున్న మహిళా కార్మికులను సైతం అసభ్యకరమైన పదజాలంతో ఎస్ఎఫ్ఏ దూషించినట్లు, సంతోష్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా, ఆమె చర్యలు తీసుకోని ఘటన వెలుగుచూసింది. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు కాసుల కోసం మెడికల్ ఆఫీసర్ అండతో ఖాశిం రజ్వీ అనే ఎస్ఎఫ్ఏ రెచ్చిపోతున్నట్లు, తద్వార తామెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్వీపర్లు ఫిర్యాదులు చేసినా, ఉన్నతాధికారులెందుకు చర్యలు తీసుకోవటం లేదనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడి మెడికల్ ఆఫీసర్ ఫిక్స్ చేస్తున్న టార్గెట్ల ప్రకారం స్వీపర్ల నుంచి మామూళ్లు వసూలు చేసి ఎస్ఎఫ్ఏ, మెడికల్ ఆఫీసర్లు పంచుకుంటున్నట్లు సమాచారం. స్వీపర్లు సరిగ్గా పని చేసినా, చేయకపోయినా, వారికి అటెండెన్స్ వేసేందుకు ఒక్కో స్వీపర్ నుంచి నెలకు వేల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తమకు వచ్చే జీతం అంతంతమాత్రం కాగా, తామెక్కడి నుంచి వేలల్లో లంచాలు ఇవ్వాలని స్వీపర్లు ప్రశ్నిస్తున్నారు. ఇవ్వని వారికి అటెండెన్స్ వేయకపోవటంతో అది కాస్త గైర్హాజరిగా మారి, తాము పనిచేసినా, తమకు కష్టార్జితం దక్కటం లేదని స్వీపర్లు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సదరు ఎస్ఎఫ్ఏకు ఉన్నతాధికారులతో పరిచయాలు, మెడికల్ ఆఫీసర్ తరపున అమ్యామ్యాల వాటాలు చెల్లిస్తున్నందునే ఈ ఎస్ఎఫ్ఏపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకంజ వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇలా మరెందరో..

ఒక్క సంతోష్ నగర్‌లోనే గాక, జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో దాదాపు ఎక్కువ సర్కిళ్లలో తరుచూ ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపొవటం పలు అనుమానాలకు తావిస్తుంది. కొంతకాలం క్రితం జియాగూడ ఏరియాకు చెందిన లక్ష్మీ అనే స్వీపర్ కూడా తమ ఎస్ఎఫ్ఏ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఏకంగా పెట్రోల్ బాటిల్‌లో ప్రధాన కార్యాలయానికి వచ్చి, ఆత్మహత్యయత్నానికి పాల్పడినా, ఉన్నతాధికారులు ఎందుకు మహిళల గోస పట్టించుకోవటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీని వేధింపులకు గురిచేస్తున్న ఎస్ఎఫ్ఏ సైతం నెలకు లక్షలాది రూపాయలు లంచాలుగా వసూలు చేసి, మెడికల్ ఆఫీసర్, డీసీలకు సమర్పిస్తున్నందున వారిపై చర్యలు తీసుకోవటం లేదన్న చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed