తీరు మార్చుకోవాల్సిందే.. టీ బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ క్లాస్!

by Prasad Jukanti |   ( Updated:2024-02-07 08:58:17.0  )
తీరు మార్చుకోవాల్సిందే.. టీ బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ క్లాస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వర్తమాన రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై రాష్ట్ర నేతలతో ఇటీవల సంఘ్ పరివార్ క్షేత్రాలు, బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ జాతీయ సహా ప్రధాన కార్యదర్శులు (సహ సర్ కార్యవాహలు) ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుండి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మన్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ హాజరయ్యారు. సంఘ్ సమావేశానికి హాజరు కావడం డికే అరుణ, ఈటలకు ఇదే తొలిసారి. ఇక ఈ సమావేశానికి ఏబీవీపీ, వీఎంఎస్, వీహెచ్ పీ, విద్యాపీట్, వనవాసి కళ్యాణ్ పరిషత్, కిసాన్ సంఘ్, ఇతర క్షేత్రాల ముఖ నేతలు సైతం పాల్గొన్నారు.

నేతల సమన్వయ లోపంపై మండిపాటు:

ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య విభేదాలపై సంఘ్ పరివార్ క్షేత్రాలు గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఆధిపత్యపోరుతో ఎందుకు చెడగొడుతున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. నేతల మధ్య విభేదాలపై లీకులు రావడంపై మండిపడిన సంఘ్ పరివార్.. ఆధిపత్య పోరుపై ఎందుకు వార్తలు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీల టార్గెట్ రీచ్ కావాలంటే దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణలో 10 సీట్లు తప్పక గెలవాల గెలవాల్సిదే అని దిశానిర్దేశం చేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందని ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు పరివార్ స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల అన్ని వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక అభ్యర్థులను నోటిఫికేషన్ కంటే ముందే ప్రకటించాలని నేతలు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన పెద్దలు.. ఈ నెలాఖరు లోపు ఒకేసారి 17 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

సంఘ్ పరివార్ ఎంట్రీతో సీన్ మారేనా?:

రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య గందరగోళ పరిస్థితి క్యాడర్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి నుంచి అనూహ్యంగా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి నేతల మధ్య ఆధిపత్యపోరే అనే విమర్శలు సొంతపార్టీలోనే వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టి పార్టీలో ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు గతంలో అమిత్ షా, జేడీ నడ్డాలు ప్రయత్నం చేసినా పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా మార్పు రాకపోవడంపై సొంత క్యాడరే నేతల వైఖరి పై మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంఘ్ పరివార్ క్షేత్రాలు రంగంలోకి దిగి నేతలకు క్లాస్ తీసుకోవడంతో ఇకనైనా తెలంగాణ బీజేపీలో సీన్ మారుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story