మెరిసిన శిల్పం.. మురిసిన రామప్ప

by sudharani |
మెరిసిన శిల్పం.. మురిసిన రామప్ప
X

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో మంగళవారం ప్రపంచ వారసత్వ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ పరిసరాల్లో ‘శిల్పం.. వర్ణం.. కృష్ణం’ పేరుతో నిర్వహించిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలకు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, శ్రీనివాస్​గౌడ్​ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామప్ప దేవాలయం తెలంగాణ జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేసాయి. 250 మంది కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. లేజర్ షో రామప్ప విరజిల్లింది. ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణి ప్రదర్శన, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం రామప్ప రామలింగేశ్వర దేవాలయ పరిసరాల్లో 'శిల్పం, వర్ణం, కృష్ణం' పేరుతో ప్రపంచ వారసత్వ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి దేవాలయ పరిసరాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్టాల్ లో రకరకాల తినుబండారాలను స్వయంగా రుచి చూశారు.

సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణ జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు.

సాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదులపై నిర్మించిన దేవాలయం అయినప్పటికీ దశాబ్దాల నుంచి అనేక భూకంపాలను తట్టుకొని చెక్కుచెదరకుండా అలాగే ఉంది అని, రామప్ప దేవాలయం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 250 మంది కూచిపూడి కళాకారులతో చేపట్టిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో లేజర్ షో పిల్లలకు పెద్దలకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శివమణి ప్రదర్శనకు తోడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్, గాయకులు కార్తీక్, ఫ్రూట్ నవీన్, ప్రముఖ గాయకుల సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, తెలంగాణ ఫిలిం చైర్మన్ అనిల్ కురుమచలం, పర్యాటక శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జలవనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాష్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీ పీఓ అంకిత్, ఎస్పీ గౌస్, ఉమ్మడి జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed