నీళ్లున్నా గొంతెండుతోంది.. అధికారుల నిర్లక్ష్యమే అసలు కారణం..

by Disha Web Desk 23 |
నీళ్లున్నా గొంతెండుతోంది.. అధికారుల నిర్లక్ష్యమే అసలు కారణం..
X

దిశ,నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నర్సంపేట మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన గురజాలలో వేసవికాలం నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. కొత్తగా ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేకున్నా కనీసం అందుబాటులో ఉన్న వనరులను సైతం వినియోగించుకోవడంలో ముందు చూపు లేకపోవడంతో గ్రామస్తులు నీళ్లు లేక అల్లాడుతున్నారు. నిత్యం నల్లాల దగ్గర నీటి కోసం ఎదురుచూస్తూ గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. ప్రస్తుతానికి వారం, పది రోజులు ఓసారి నీటి సరఫరా చేస్తుండటంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఈ నేపథ్యంలోనే నిండు కుండలా ఉన్న కొత్త నల్లాల బావిని ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పుష్కలంగా ఉన్న జలసిరిని అందుబాటులోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురిజాల గొంతెండుతోంది..

నర్సంపేట మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీల్లో గురిజాల ఒకటి. 3800 ఓటర్లతో దాదాపు పదివేల జనాభా గురజాలలో ఉన్నారు. వీరికి నీటి సౌకర్యం అందించడానికి రెండు బోర్లు, మూడు బావులు, 22 చేతి పంపులు, 625 నల్లాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ గురజాల గ్రామం. నీటి సమస్యను అధిగమించే అవకాశం ఉన్నా ఆ వైపుగా అధికారులు కనీసం చొరవ చూపక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వెరసి కొత్త నల్లాల బావి లో పుష్కలంగా నీళ్లున్నా అరకొర నీటితో గ్రామస్తులు ఇబ్బందులు పాలయ్యే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి నల్లాల దగ్గర నీళ్ల కోసం ఎదురుచూపులు గురిజాల గ్రామస్తులకు సాధారణంగా మారనుంది.

కొట్టొచ్చిన అధికారుల నిర్లక్ష్యం...

గురిజాల గ్రామంలో ఏటేటా పెరుగుతున్న నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని గత సర్పంచ్ గోడిశాల మమత సదానందం గ్రామ శివారులోని పోలు చెరువు వద్ద రూ.30 లక్షలతో ప్రభుత్వం మంజూరు చేసిన పెద్ద బావి నిర్మాణం చేపట్టారు. పూర్తయిన అనంతరం బావి నుండి ట్యాంక్ వరకు విద్యుత్ కనెక్షన్ మినహా మిగతా పైప్ లైన్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించి నిధులు ఇప్పటికీ విడుదల కాలేదని తెలుస్తోంది. అధికారుల చుట్టూ గత ఐదు ఏండ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలతో నీటి సరఫరాకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకున్నప్పటికీ ఈ ఏడాది తక్కువ వర్షపాతం తో నీటి ఎద్దడి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినియోగిస్తున్న బావుల్లో నీరు అడుగంటింది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.

మరోవైపు కొత్త నల్లాల బావిలో నీరు పుష్కలంగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కాగా గ్రామస్తులకు నీటి సమస్య తీర్చడానికి చర్యలు తీసుకోవడంలో అధికారులు చొరవ చూపాలన్న డిమాండ్ గ్రామస్తుల నుండి వ్యక్తం అవుతోంది. కొత్త నల్లాల బావి సమస్య పట్ల అధికారులు స్పందించకపోవడంతో నిర్మించిన బావి వృథాగా ఉంటుందన్న చర్చ జనాల్లో జరుగుతోంది. బావికి విద్యుత్ కనెక్షన్ ఇస్తే ప్రజలకు సమృద్ధిగా నీరందే పరిస్థితి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం గ్రామస్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బావిని వినియోగంలోకి తీసుకువచ్చి, నీటి సమస్యను గురిజాల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed