మహబూబాబాద్ జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభంలోనే రగడ..

by Kalyani |   ( Updated:2023-04-10 11:48:42.0  )
మహబూబాబాద్ జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభంలోనే రగడ..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: స్టాండింగ్ కమిటీ మీటింగ్ లేదు.. నిధులు లేవు.. కనీసం జిల్లా జడ్పీటీసీల సమస్యలను పట్టించుకునే వారే లేరని జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, మరిపెడ జడ్పీటీసీ శారద, గూడూరు జడ్పీటీసీ సూచిత్రలు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ బిందు ఆధ్వర్యంలో జరుగుతున్నా క్రమంలో వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, శారదాలు ముందుగా మా సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతే మీటింగ్ నిర్వహించాలని భీష్మించి కూర్చున్నారు. మరిపెడ జడ్పీటీసీ శారదా కింద కూర్చొని నిరసన తెలిపారు. మూడు సార్లు బైకాట్ చేసినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అన్నారు.

అధికార పార్టీకి చెందిన మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు జడ్పీటీసీ సూచిత్ర, డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ, దంతాల పల్లి జడ్పీటీసీ శారదా, వెంకటేశ్వర రెడ్డిలు నిరసన తెలిపారు. నిధులు రావడం లేదని, వచ్చిన నిధులు సమానంగా కేటాయింపు లేదని ఆరోపించారు. జడ్పీటీసీలకు నిధులు లేకపోతే ఎలా పనులు చేయాలని ప్రశ్నించారు. వెంటనే జడ్పీ చైర్ పర్సన్ బిందు కలుగజేసుకొని నూతనంగా మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని వీటిపై త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలపడంతో మీటింగ్ ప్రారంభం అయింది.

Advertisement

Next Story