నారాయణపేట కలెక్టర్ పై డీవోపీటీకి ఫిర్యాదు

by Javid Pasha |
నారాయణపేట కలెక్టర్ పై డీవోపీటీకి ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నారాయణపేట కలెక్టర్ శ్రీహర్షపై విశ్వహిందూ పరిషత్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(డీవోపీటీ) మంత్రి జితేంద్రసింగ్ కి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జనవరి 26వ తేదీన నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డలో అంగన్ వాడీ టీచర్ ఎస్తేర్ జాతీయ జెండాను అవమానపరిచిందని, ఆ ఉద్యోగిపై నారాయణపేట కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు మరుసటి రోజే వెళ్లగా కలెక్టర్ సైతం తమపై దురుసుగా ప్రవర్తించారని వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరీనాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కలెక్టర్ తమతో అమర్యాదగా ప్రవర్తించారని, హుందాతనాన్ని కోల్పోయి వ్యవహరించారని వారు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి వివరించాలని పలుమార్లు అపాయింట్ మెంట్ కోరినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సీఎస్ నుంచి స్పందన రాకపోవడంతో డీవోపీటీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రజల కోసం పని చేయాల్సిన అధికారులు ప్రజలను ఇబ్బందులపాలు చేయడం ఏమాత్రం తగదని ఫైరయ్యారు. ఉద్యోగ ధర్మం విస్మరించడం ఏమాత్రం తగదన్నారు. అధికారి ఏ స్థాయిలో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప రాజ్యాంగాన్ని అతిక్రమించడం సరికాదని వారు హితవు పలికారు.

Advertisement

Next Story