ఆ తండాలలో కనిపించని ఉగాది సందడి.. కారణమిదే!

by Rajesh |
ఆ తండాలలో కనిపించని ఉగాది సందడి.. కారణమిదే!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్/గండీడ్: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పల్లె.. పట్టణం అన్న తేడాలు లేకుండా ప్రతిచోట ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలను జరుపుకోగా.. రెండు తండాలలో మాత్రం పండగ వాతావరణం కనిపించలేదు. నిర్మానుష్య వాతావరణం నెలకొంది. ఇటీవల టీఎస్‌పీ‌ఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారాలు రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించిన అంశం తెలిసిందే..! ఈ వ్యవహారాలలో పోలీసులు పదిమందిని ప్రధాన నిందితులుగా భావించి.. అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఆరుగురు మహబూబ్ నగర్ జిల్లా.. గండీడ్ మండలం మన్సూర్ పల్లి తండా, పంచ లింగాల తండాకు చెందినవారు కావడంతో గత కొన్ని రోజుల నుండి ఈ రెండు తండాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.. పంచలింగాల్ గ్రామానికి చెందిన రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్, మన్సూర్ పల్లి తండాకు చెందిన రేణుక సోదరుడు రాజేశ్వర్, వారి సమీప బంధువులు నీలేష్, గోపాల్ నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయక్ పేపర్ల లీకేజీ వ్యవహారాలలో సంబంధం ఉందన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయంపై సిట్ అధికారులు విచారణలు చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక విధంగా భయాందోళనలు చెందుతున్నారు. మీడియా ప్రతినిధులు కానీ ఇతరులు ఎవరైనా కానీ జరిగిన సంఘటనలకు సంబంధించి వివరాలు అడిగే ప్రయత్నాలు చేస్తే తమకు ఏమి తెలియదు అని చెబుతున్నారు. కొంతమంది ఇండ్లకు తాళాలు వేసి ఉండడం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు జరిగిన సంఘటన కారణంగా పండగకు ఊళ్ళకు రాకపోవడంతో ఈ రెండు తండాలు వెలవెలబోయాయి.

వ్యవహారాలన్నీ బయటేనా?

టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారాలలో తమ తండాలకు చెందినవారు ప్రధాన సూత్రధారులు అని మీడియాలలో ప్రచారం జరుగుతుంది. కానీ ఆ వ్యవహారాలు ఇక్కడ జరగలేదు. రేణుక, డాక్య నాయక్ దంపతులు మహబూబ్ నగర్‌లో, కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయక్ హైదరాబాద్‌లో ఉంటున్నారు. మిగిలిన ముగ్గురు తండాలలో ఉంటున్నారని తెలిసింది. రేణుక తల్లి లక్ష్మీబాయి మన్సూర్ పల్లి తండా సర్పంచ్ కావడంతో ఆమె కుమారుడు రాజేశ్వర్ నాయక్ గ్రామ అభివృద్ధి, పనుల వ్యవహారాలకు సంబంధించి తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవాడని తెలిసింది.

నిర్మానుష్యంగా తండాలు..

పండగ వాతావరణంతో సందడిగా ఉండవలసిన మన్సూర్ పల్లి తండా, పంచలింగాలు తండాలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. జరిగిన సంఘటనలకు సంబంధించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన వివరాలు చెప్పడానికి రెండు తాండాలవాసులు ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. మీడియాలో వస్తున్న విషయాల ద్వారానే పేపర్ లీకేజీ వ్యవహారాలు, మా తండావాసులు అరెస్టు అయిన అంశాలు తెలుస్తున్నాయని చెప్పారు.

మరికొందరు అయితే మాకు ఏమీ తెలియదంటూ వెళ్లిపోయారు. తండాలలో.. వృద్ధులు, అక్కడక్కడ చిన్న పిల్లలు మినహాయిస్తే.. యువకులు, నడివయస్కులు ఎవరూ కూడా బయట కనిపించలేదు. వలసలు వెళ్ళిన వారు తిరిగి రాకపోవడంతో.. ఇంటి వద్ద ఉంటున్న పిల్లలు, వృద్ధులు తమ తమ ఇండ్లలోనే నామమాత్రంగా పండగను జరుపుకున్నారు. పండగ పూట తండాలలో ఉన్న దేవాలయాలలోనూ పూజలు చేయడానికి ప్రజలు ముందుకు రాలేదు. మొత్తంగా ఈ రెండు తండాలలో ఉగాది వేడుకల ఉషస్సులు ఎక్కడా కూడా కనిపించలేదు.

ఏం జరిగిందో తెలుస్తలేదు..

ఏం జరిగిందో అసలు తెలుస్తలేదు. పేపర్ వాళ్లు ఇతరులు వచ్చి మా పిల్లల వివరాలు అడుగుతుంటే భాదేస్తుంది. తప్పుడు పనులకు ప్రాధాన్యతను ఇవ్వలేదు. మా పిల్లలను పద్ధతి ప్రకారమే పెంచాం.. కానీ ఏం జరిగిందో తెలియదు. మా కూతురు రేణుక, అల్లుడు డాక్య నాయక్, కుమారుడు రాజేష్, మరో ముగ్గురిని తీసుకువెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకుందామని పట్నం పోయిన.. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేసిండ్రు.

-లక్ష్మీబాయి, సర్పంచ్, మన్సూర్ పల్లి తాండ.

వాళ్లు మంచి వాళ్లే.. ఏం జరిగిందో తెలియదు..!?

పోలీసులు తీసుకువెళ్లిన మా రెండు తండాలకు చెందిన ఆరుగురు మంచి వాళ్ళు.. కాయకష్టం చేసుకుంటూ.. మంచి చదువులు చదివిండ్రు.. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం మాకు బాధాకరమే. ఉగాది పండుగను నామమాత్రంగా జరుపుకుంటున్నాం.

-శంకర్ నాయక్, మన్సూర్ పల్లి తండావాసి.

Advertisement

Next Story

Most Viewed