Khairatabad Ganesh:ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి నేడే చివరి రోజు.. బారులు తీరిన భక్తులు

by Jakkula Mamatha |
Khairatabad Ganesh:ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి నేడే చివరి రోజు.. బారులు తీరిన భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్:దేశ వ్యాప్తంగా ఘనంగా గణపయ్య ఉత్సవాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశుడి(Khairatabad Ganesh) దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఎల్లుండి(మంగళవారం) శోభాయాత్ర, నిమజ్జనం జరపనుండడంతో ఇవాల్టితో దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ రోజు అర్ధరాత్రి తర్వాత లంబోదరుడి దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గణపయ్య శోభాయాత్ర కోసం భారీ వాహనం ఇప్పటికే వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో చివరి రోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి బడా గణేశుడి దర్శనానికి బారులు తీరారు.

భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్‌లో భారీగా రద్దీ నెలకొంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్ వైపు రద్దీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు సాయంత్రం బడా గణపతి మెడలో వేసిన లక్ష రుద్రాక్షలను పంచి పెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మహా శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరగనుంది.

Advertisement

Next Story