ఓట్ల కోసం మూడు పార్టీల పాట్లు.. మ‌రి న‌ల్లసూరీళ్లు మొగ్గు చూపేదెవ‌రికీ..?

by Sathputhe Rajesh |
ఓట్ల కోసం మూడు పార్టీల పాట్లు.. మ‌రి న‌ల్లసూరీళ్లు మొగ్గు చూపేదెవ‌రికీ..?
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : తెలంగాణ‌కు కొంగుబంగార‌మైన సింగ‌రేణి కార్మికుల ఓట్ల కోసం నేత‌లు గాల‌మేస్తున్నారు. ఎంపీ ఎన్నిక‌ల్లో ప్రచారం సంద‌ర్భంగా ఈ ప్రాంత ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నాయ‌కులు అటు వైపుగా దృష్టి సారించారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, బీఆర్ఎస్‌, బీజేపీ దృష్టి సారించాయి. గ‌తంలో కార్మికుల‌కు తాము చేసిన ప‌నులు చెబుతూ ఇక ముందు ఏం చేస్తామో చెబుతున్నాయి. మ‌రి కార్మికులు ఎటు వైపు మొగ్గు చూపుతార‌న్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థక‌మే..

తెలంగాణలోని ఆరు జిల్లాల ప‌రిధిలో సింగ‌రేణి విస్తరించి ఉంది. పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కల్లో చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలలోని చాలా ప్రాంతాలలో సింగరేటి ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఈ ప్రాంతాల్లోని ఎంపీ అభ్యర్థులు అంతా కార్మికుల ఓట్ల కోసం క్యూ క‌డుతున్నారు. సింగ‌రేణిలోనే అత్యంత పెద్దదైన శ్రీ‌రాంపూర్ పెద్దప‌ల్లి ప‌రిధిలో ఉండ‌టంతో పాటు, మిగ‌తా ప్రాంతాలైన బెల్లంప‌ల్లి, మంద‌మ‌ర్రిల్లో సైతం కార్మికుల ఓట్ల కోసం ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం బొగ్గు గ‌నుల మీద‌కు వెళ్లి గేట్ మీటింగ్ల ద్వారా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కోల్‌బెల్ట్ ఓట‌ర్ల విల‌క్షణ‌మైన తీర్పు..

ఈ ప్రాంతంలో ఓట‌ర్లు ఎప్పుడు విల‌క్షణ‌మైన తీర్పు ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు ఒక పార్టీ వైపు మొగ్గు చూప‌రు. 2017లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచింది. కానీ.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. ఇక ఈ ఏడాదిలో జ‌రిగిన సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లో ఏఐటీయూసీ విజ‌యం సాధించ‌గా, కాంగ్రెస్ అనుంబంధ సంఘ‌మైన ఐఎన్‌టీయూసీ భారీగా ఓట్లు సాధించింది. ఇక‌, 2019 లోక్‌సభ ఎన్నికలు నాటికి సింగరేణి ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌లో బీజేపీ గెలవగా.. మిగతా నాలుగు పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది.

మా వల్లే హక్కుల సాధన : బీఆర్ఎస్

సింగరేణిలో బీఆర్ఎస్ వల్లనే హక్కుల సాధన సాధ్యం అయిందని ఆ పార్టి నేతలు చెబుతున్నారు. సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికారంలోకి వచ్చాక 75 హక్కులు సాధించినట్లు చెబుతున్నారు. అసలు జాతీయా కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమదేనని కార్మిక్లకు అవగాహన కల్పిస్తున్నారు. కార్మికులకు ప్రధాన డిమాండ్ అయిన ఇన్‌కం టాక్స్ ర‌ద్దు విష‌యంలో మొద‌ట‌గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వమేన‌ని చెబుతున్నారు. తెలంగాణ మొద‌టి శాస‌న‌స‌భ స‌మావేశాల్లో సింగ‌రేణి కార్మికుల ఇన్‌కంటాక్స్‌పై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామ‌ని ఇక్కడ ఎంపీగా తమ అభ్యర్థి గెలిస్తే పార్లమెంట్ సాక్షిగా కొట్లాడుతామని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌నే కార్మికుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ప‌థ‌కాలు ప్రవేశ‌పెట్టామ‌ని చెబుతున్నారు.

జోరుగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్..

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం జోరుగా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ తరఫున నాయకులు, నేతలు కార్మిక క్షత్రంలో కలియదిరుగుతూ కార్మికులు, వారి కుటుంబ ఓట్లను సాధించేందుకు ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే సింగరేణి మనుగడ, పురోగతి సాధ్యం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. సింగరేణిలో ఎన్నో హక్కులు సాధించిన ఘనత కాంగ్రెస్‌దేనని చెబుతూ కార్మికుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రచారంలో వెన‌క‌బ‌డ్డ బీజేపీ అభ్యర్థి..

పెద్దప‌ల్లి పార్లమెంట్ ప‌రిధిలో అటు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. పెద్ద ఎత్తున గ‌నుల ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ప్రచారం విష‌యంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీ‌నివాస్ చాలా వెన‌క‌బ‌డ్డారు. అస‌లు ఆయ‌న ఎక్కడా క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గర ప‌డ‌టంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కలియతిరుగుతుంటే ఆయ‌న మాత్రం క‌న‌బ‌డ‌టం లేదు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎవ‌రూ అనే విష‌యం కూడా తెలియ‌కుండా పోయింది. మ‌రోవైపు ఆయ‌న త‌ర‌ఫున కూడా బీజేపీ నేత‌లు పెద్దగా ప్రచారంలో పాల్గొన‌డం లేదు. దీంతో ఇక్కడ ఆ పార్టీకి మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. గ‌నులు, సింగ‌రేణి కాల‌నీల్లో ప్రచారం హోరెత్తుతున్న నేప‌థ్యంలో సింగ‌రేణి కార్మికులు మాత్రం ఎటు వైపు మొగ్గుచూపుతున్నార‌నేది వేచి చూడాలి.

Advertisement

Next Story