BRS: బీఆర్ఎస్ ప్రోగ్రామ్‌కు ఆ ముగ్గురు దూరం.. అగ్రనేతల తీరుపై విమర్శలు

by Prasad Jukanti |
BRS: బీఆర్ఎస్ ప్రోగ్రామ్‌కు ఆ ముగ్గురు దూరం.. అగ్రనేతల తీరుపై విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీఆర్ఎస్ (BRS) పార్టీలో టాప్ లీడర్ల తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao), ఎమ్మెల్సీ కవిత (Kavitha) దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ప్రజలను మోసం చేసినందుకు నిరసనగా మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నేతలంతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇందుకు పిలుపునిచ్చిన కేటీఆర్‌తోపాటు పార్టీలో టాప్ లీడర్లుగా ఉన్న హరీశ్‌రావు, కవిత సైతం ఎక్కడా వినతిపత్రాల కార్యక్రమంలో కనిపించకపోవడంతో అగ్రనేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కేడర్ కదులుతుంటే వారిలో ఉత్సాహం నింపాల్సిన అధినేత ఎలాగు బయటకు రాకపోగా మిగతా ముఖ్యనేతలైనా హాజరు కాకపోవడం ఏంటనే అసంతృప్తి గులాబీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే అధినేత కేసీఆర్‌పై విమర్శలు..

ఈనెల 27న తెలంగాణ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఈ 420 మోసాల పట్ల డూప్లికేట్ గాంధీలకు ఒరిజినల్ గాంధీ జ్ఞానోదయం కలిగించేలా జనవరి 30న రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కేటీఆర్ సహా ముఖ్యనేతలు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గత కొంతకాలంగా పార్టీ అధినేత కేసీఆర్ (KCR) పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతోపాటు అసెంబ్లీకి సైతం హాజరు కాకపోవడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed