ఈ ఏడాది 56 మంది రిటైర్.. జాబితా విడుదల

by GSrikanth |
ఈ ఏడాది 56 మంది రిటైర్.. జాబితా విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవైపు రిటైర్డ్ అధికారులు ఇంకా వివిధ బాధ్యతల్లో కొనసాగుతూ విమర్శలు వస్తూ ఉండడం, మరోవైపు ఇరిగేషన్ డిపార్టుమెంటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకున్నది. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఈ ఏడాది రిటైర్ అవుతున్న ఇంజనీర్-ఇన్-చీఫ్ మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు వివిధ హోదాల్లోని ఇంజనీర్ల జాబితాను ఆ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా రూపొందించారు. దీంతో వారంతా రిటైర్‌మెంట్ ప్రకారం విధుల నుంచి వైదొలగాల్సిందేననే మెసేజ్ ఇచ్చినట్లయింది. ఇందులో ఈ-ఇన్-సీ నాగేందర్ మొదలు నలుగురు చీఫ్ ఇంజనీర్లు, 22 మంది సూపరింటెండింగ్ ఇంజనీర్లు, 19 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 10 మంది డిప్యూటీ ఈఈలు ఉన్నారు.

వీరిని ఎంత మాత్రం కొనసాగించే అవకాశం లేదని, రిటైర్ అయిన తర్వాత ఎక్స్ టెన్షన్ ఇచ్చే అవకాశం లేదని ఆ శాఖ సెక్రటరీ తాజా ఉత్తర్వుల (జాబితా)తో పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి సాగునీటి వ్యవహారాల్లో ఓఎస్డీగా వ్యవహరించి శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే కూడా ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఈ-ఇన్-సీ గా వ్యవహరించిన నాగేందర్ రావు సైతం మే 31న రిటైర్ కానున్నారు.

Advertisement

Next Story