పౌరసరఫరాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం..! పక్కదారి పడుతోన్న రేషన్ బియ్యం

by Shiva |
పౌరసరఫరాల శాఖలో అధికారుల ఇష్టారాజ్యం..! పక్కదారి పడుతోన్న రేషన్ బియ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటి పౌరసరఫరాల శాఖ. ప్రభుత్వాలకు మంచి పేరు.. చెడ్డ పేరు ఏది రావాలన్నా ఈ శాఖ పాత్ర ముఖ్యమైనది. రాష్ట్రంలోని దాదాపుగా ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న విభాగం ఇది. అయితే ఈ విభాగం పనితీరుపై నిత్యం విమర్శలు, ఆరోపణలు, అధికారుల అవినీతి, నిర్లక్ష్యంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుంది. రాష్ట్రంలోని 90 లక్షలకు పైగా ఉన్న రేషన్కార్డులు, వ్యవసాయదారుల నుంచి వడ్లు సేకరించడం, నిత్యావసర వస్తువుల ధరలు, వాటి నియంత్రణ, గ్యాస్ సబ్సిడీ ఇలాంటి ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అంశాలపై సరియైన విధంగా వ్యవహరించకపోవడం, జారీ చేసే ప్రక్రియ, ప్రతి నెల ఇచ్చే బియ్యం, సరుకులు ఈ శాఖ ద్వారా జరుగుతుంటాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ తెల్ల రేషన్ కార్డు. అంతటి ప్రాధాన్యత ఉన్న అంశంపై అధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం లేదని, వాస్తవ పరిస్థితులను, ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా వ్యవహరించడంతో ప్రభుత్వంపై ప్రభావం చూపింది. ప్రజలు మీ సేవ కేంద్రాల బాట పట్టారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. అధికారులు స్పష్టమైన ప్రకటనలు, శాఖ వద్ద స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. దీంతో ప్రభుత్వం బద్నాం అవుతోంది.

బియ్యం అక్రమ రవాణా..

రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మూలన ‘రేషన్ బియ్యం అక్రమ రవాణా, పట్టుకున్న పోలీసులు’ ఇదే జరుగుతోంది. ఏ పత్రిక, చూసినా, ఏ మీడియాలో ఇదే అంశం దర్శనమిస్తోంది. కానీ అధికారులు చెప్పేది మాత్రం బియ్యం అక్రమ రవాణాకు అవకాశం లేకుండా చేశాం, ఫింగర్ ఫ్రింట్, ఆధార్ అన్ని అమలు చేస్తున్నామంటూ జోరుగా ప్రకటనలు ఇస్తుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా పరిస్థితి ఉంది. వీటిని అరికట్టడానికి సీరియస్ గా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. రేషన్డీలర్లు, అధికారులు కుమ్మక్కు ఫలితంగానే ఇదంత జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. సరైన నిఘా, కేసుల నమోదు, సీరియస్గా వ్యవహరించకపోవడం లాంటివి కారణంగా చెబుతున్నారు. లారీలకు లారీల బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ప్రజలకు చేరకుండానే ఎలా పోతుంది, మిల్లర్ల నుంచా..? లేకా రవాణా చేయడంలోనే జరుగుతుందా అనే దానిపై ఇంత వరకు దృష్టి పెట్టలేదు. రాబోయే రోజుల్లో కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్రమాలు, అక్రమ రవాణా ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎఫ్ సీఐకి ఏనాడు కూడా పూర్తి స్థాయిలో సీఎంఆర్ పెట్టని పరిస్థితి ఉంది. ఎఫ్‌సీఐ లేఖలు రాయడం ఆ తరువాత కొద్ది రోజులు హడావుడి చేయడం మాములే.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

మిల్లర్ల అక్రమాల్లో అంతే లేదు..

సీఎంఆర్లో అక్రమాలకు అంతే లేదు. ఎన్ని సార్లు కేసులు పెట్టినా, హెచ్చరించినా, మిల్లులు సీజ్ చేసినా మిల్లర్లలో మాత్రం మార్పు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం అధికారులు అవినీతి, నిర్లక్ష్యం, మిల్లర్లతో కుమ్మక్కు కావడం తదితర కారణాలుగా చెబుతున్నారు. మొదట్లో ఏదో హడావుడి చేయడం ఆ తరువాత దానిని మరిచిపోవడం జరగడం కామన్గా మారింది. మిలర్ల పట్ల కఠినంగా వ్యవహరించడం, మొదటి నుంచి నిబంధనలు అమలు చేయకుండా తీరా చివర్లో ఏదో చేయాలని ప్రయత్నించడంతో ఫలితాలు రావడంలేదనే విమర్శలు, ఆరోపణ‌లు ఉన్నాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుపై సన్నబి య్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల నుంచి సన్న వడ్లను సేకరించింది. అయితే సన్నవడ్లకు డిమాండ్ దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే ధర కంటే అధికంగా మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా రైతుల కల్లా వద్దే కొనుగోలు చేశారు. దీంతో తెల్లరేషన్ కార్డుదారులకు అవసరమైన బియ్యం తక్కువ పడ్డాయి. కానీ ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి వివరించకుండా దాచే ప్రయత్నం చేసింది.

Advertisement
Next Story

Most Viewed