నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ రాలే.. నిరాశలో నిరుద్యోగులు

by Sathputhe Rajesh |   ( Updated:12 April 2022 1:15 AM  )
నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ రాలే.. నిరాశలో నిరుద్యోగులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపట్నుంచే నోటిఫికేషన్లు అన్న హామీకి ఎట్టకేలకు నెల దాటింది. ముందుగా గ్రూప్​ – 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్​పీఎస్సీ కూడా సిద్ధమైంది. సిలబస్​ అప్​గ్రేడ్​ చేసుకుంది. కొన్ని శాఖల నుంచి రిజర్వేషన్ల ఆధారంగా పోస్టులు కూడా ఖరారు చేశారు. కానీ, నోటిఫికేషన్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం రావడం లేదు. తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లపై కొత్త డైలమా నెలకొంది. టీఎస్​ పీఎస్సీపై నమ్మకం లేదని, ఇంటర్వ్యూలు పెడితే 100 మార్కులను అమ్ముకుంటారనే అనుమానాలతో గ్రూప్ –1, గ్రూప్​ –2 ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూలు ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెరపైకి వచ్చింది. తాజాగా సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు కూడా ఈ విషయాన్ని ప్రకటించడంతో.. ఇక నోటిఫికేషన్లకు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో అటు టీఎస్​పీఎస్సీ కూడా ప్రభుత్వ ప్రతిపాదనలపై భగ్గుమంటోంది. ఒక్కో సభ్యుడికి నెలకు మూడు, నాలుగు లక్షల జీతాలతో పాలకవర్గాన్ని నియమించిన ప్రభుత్వం.. టీఎస్​పీఎస్సీపై నమ్మకం లేకుండా అవినీతి ముద్ర వేస్తుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఐఏఎస్​ అధికారి అయితేనే బాగుంటుందని ప్రకటించిన ప్రభుత్వం.. టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి జనార్ధన్​రెడ్డిని ఎంపిక చేసింది. కానీ, ఇప్పుడు టీఎస్​పీఎస్సీ పాలకవర్గంపైనే ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసే విధంగా వ్యవహరిస్తోంది.

నెల దాటింది

అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్​ ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనకు నెల రోజులు దాటింది. గత నెల 9న కేసీఆర్​ 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. రేపట్నుంచే ఒక్కో శాఖ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆదేశాలు ఇస్తున్నామని కూడా ప్రకటించారు. అప్పటి నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 91వేల ఉద్యోగాలను సీఎం ప్రకటించగా.. దీనిపై ఆర్థిక శాఖ గత నెల 23న తొలి విడతలో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జీవోలు జారీ చేసింది. ఈ జీవోల జారీతో నిరుద్యోగులు పుస్తకాల్లో మునిగారు. కోచింగ్​ సెంటర్లకు ఎగబడ్డారు. ఇక ఇవ్వాళో, రేపో నోటిఫికేషన్లు వస్తాయంటూ ఎదురుచూస్తూనే ఉన్నారు.

తెరపైకి కొత్త కథ

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లపై ప్రభుత్వం వ్యూహత్మక తాత్సారం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రకటన తర్వాత.. మళ్లీ నిరుద్యోగులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో గత నెల 23న ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. దీనిలో గ్రూప్​ –1 ఉద్యోగాలు 503 ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త కథ తెరపైకి వచ్చింది. గ్రూప్​ –1, గ్రూప్ –2 ఉద్యోగాల నియామకంలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. గ్రూప్​ –1లో ఇంటర్వ్యూకు 100 మార్కులు, గ్రూప్ –2లో 75 మార్కులు ఖరారు చేశారు. కానీ, ఈ ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారానికి వచ్చింది. దీనిపై ప్రభుత్వం తరుపునే ప్రతిపాదనలు సిద్ధమయ్యాని అధికారవర్గం నుంచే లీకులిచ్చారు. దీనికి బలం చేకూర్చుతున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు రెండు రోజుల కిందట సిద్దిపేటలో ఇదే కామెంట్​ చేశారు.

ఇక ఎదురుచూపులేనా?

వాస్తవానికి టీఎస్​పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై దాదాపు అంతా సిద్ధం చేసింది. సిలబస్​ను అప్​గ్రేడ్​ చేసింది. 2011 తర్వాత గ్రూప్​ –1 భర్తీ లేకపోవడంతో ప్రశ్నాపత్రాల్లో సిలబస్​ను వెల్లడించింది. మొత్తం రాత పరీక్షలకు మార్కులు, ఎంత సమయం అనే వివరాలన్నీ తేల్చింది. 900 మార్కులు రాత పరీక్షకు, 100 మార్కులు ఇంటర్వ్యూకు ఖరారు చేసింది. ఇక గ్రూప్​ –2లో 600 మార్కులు రాత పరీక్షకు, 75 మార్కులు ఇంటర్వ్యూకు నిర్ధారించారు. కానీ, ఇప్పుడు ఇంటర్వ్యూలను ఎత్తివేస్తే ఈ మార్కులను ఎందులో కలుపాలనే అంశాలు తేలాల్సి ఉంది. దీంతో రీ షెడ్యూల్​ చేయడం, రాత పరీక్ష, దానికి సంబంధించిన మార్కులు, టైం టేబుల్​, పరీక్షా పేపర్లను మొత్తం మార్చాల్సి ఉంటోంది. మళ్లీ దీన్ని రీ షెడ్యూల్​, రీ సిలబస్​ చేయాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పడుతుందని టీఎస్​పీఎస్సీ వర్గాలు చెప్పుతున్నాయి. రాత పరీక్షల్లో ఒక్క పేపర్​ మార్చినా.. దానికి సంబంధించిన టాపిక్స్​, సిలబస్​ మొత్తం మళ్లీ కొత్తగా రెడీ చేయాల్సి ఉంటోంది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తే ఈ మార్కులు కచ్చితంగా రాత పరీక్షల్లోనే సర్ధుబాటు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే ఒక్కో పేపర్​కు 150 మార్కులు ఖరారు చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూ మార్కులతో మరో పేపర్​ను రెడీ చేయాలంటే టాపిక్స్​ ఎంపికకు చాలా సమయం తీసుకుంటోంది. అప్పటి వరకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

అనుమానాలేనా!

ఇక టీఎస్​పీఎస్పీపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు పెంచుకున్నట్లు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఈ పోస్టుల ఎంపికలో ఇంటర్వ్యూలను రద్దు చేసింది. అయితే దానికి బలమైన కారణం.. అక్కడి రాజకీయ పరిణమాలే. టీడీపీ హయాంలో ఏపీ​పీఎస్సీని నియమాకం చేశారు. అందులోని పాలకవర్గం దాదాపుగా టీడీపీ బ్రాండ్​. దీంతో జగన్​ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, మన రాష్ట్రంలో టీఎస్​పీఎస్సీని గతేడాదిలో సీఎం కేసీఆర్​ ఖరారు చేశారు. అప్పటికే వ్యవసాయ శాఖ కమిషనర్​గా సీఎంతో సన్నిహితంగా ఉన్న జనార్ధన్​రెడ్డికి చైర్మన్​గా అవకాశం కల్పించారు. ఏడుగురు సభ్యులను నియమించారు. ప్రస్తుతం ఈ కమిటీపై సీఎంకు నమ్మకం లేదనే అభిప్రాయాలు.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే గ్రూప్​–1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ఎత్తివేయాలనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ ప్రతిపాదనలను టీఎస్​పీఎస్సీ నుంచే వచ్చాయనే దానిపై ఆ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. టీఎస్​పీఎస్సీ నుంచి ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story