అమిత్ షా కామెంట్స్ పక్కా వ్యూహమా? లేక బీజేపీ ప్రచార అస్త్రమా?

by GSrikanth |
అమిత్ షా కామెంట్స్ పక్కా వ్యూహమా? లేక బీజేపీ ప్రచార అస్త్రమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్స్ మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చేవెళ్ల సభలో అమిత్ షా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇటీవలే కర్ణాటకలో ముస్లిం రిజ్వేషన్లను బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే తాజాగా తెలంగాణలోనూ అదే పంథాలో ముందుకు సాగుతామని అమిత్ షా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని పదే పదే చెబుతున్న అమిత్ షా తాజా వ్యాఖ్యల వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. కేసీఆర్ కు, ఎంఐఎంకు చెక్ పెట్టడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపిస్తున్నది.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్నది. గెలుపు కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ తో మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం ఈసారి గతానికి భిన్నంగా మరిన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సై అంటోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తాము 50 స్థానాల్లో పోటీ చేయబోతున్నామని అసెంబ్లీలో ఎంఐఎం ప్లోర్ లీడర్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఓటర్లు డిసైడ్ మేకర్స్ గా ఉన్న చోట్ల ఎంఐఎం బరిలోకి దిగబోతోందనే చర్చ గత కొంత కాలంగా జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం మైనార్టీ ఓటర్లపై దృష్టి సారించింది.

ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని పోటీకి దించకుండా మజ్లిస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చి ఏకగ్రీవం అయ్యేలా చేసింది. దీంతో ఆ వర్గం బీఆర్ఎస్ పట్ల కాస్త పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా కేసీఆర్ వ్యూహరచన చేశారనే ప్రచారం జరిగింది. ఇక ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చి ఓ సారి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఆ తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ వర్గం ఓట్లపై బీఆర్ఎస్ ప్రధానంగా ఆశలు పెట్టుకుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతో ఈ సంగతి గ్రహించిన అమిత్ షా.. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లుగా ముస్లిం ఓట్లను బీఆర్ఎస్, మజ్లీస్ మధ్య స్ప్లిట్ అయ్యేలా తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా జరుగుతున్నది.

మత పరమైన రిజర్వేషన్లు చెల్లవు అనేది బీజేపీ బలంగా వాదిస్తోంది. ఈ వాదనతోనే కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేశారు. కానీ ఈ ప్రక్రియకు సుప్రీంకోర్టులో బ్రేక్ పడింది. కర్టాటక వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగానే అమిత్ షా తాజాగా తెలంగాణలోనూ రద్దు ప్రకటన చేయడం రాజకీయంగా సంచలనం అవుతున్నది. అయితే అమిత్ షా వ్యాఖ్యలు తెలంగాణలో నాన్ ముస్లిం ఓటర్లను ఏకం చేసేలా బీజేపీకి బర్నింగ్ టాపిక్ గా మారే అవకాశం ఉండగా, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ముస్లిం ఓట్లు చీలి అంతిమంగా తమకు మేలు కలుగుతుందనే అభిప్రాయంతో బీజేపీ ఉందనే చర్చ జరుగుతున్నది. మరి ఈ ఇష్యు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపును క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read..

అమిత్ షా టూర్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

Next Story

Most Viewed