బీఆర్ఎస్‌ను ఏకిపారేస్తున్న కేడర్.. అధిష్టానం తప్పులను ఎండగడుతున్న వైనం

by Shiva |
బీఆర్ఎస్‌ను ఏకిపారేస్తున్న కేడర్.. అధిష్టానం తప్పులను ఎండగడుతున్న వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేతలకు కేడర్ భయం పట్టుకుంది. పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో కేడర్ గులాబీ నేతలు, అధిష్టానం తీరును ఎండగడుతున్నారు. పార్టీకోసం ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్నా తమను గుర్తించడం లేదని ఫైర్ అవుతున్నారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న పారాచుట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పార్టీ కోసం రెండున్నర ఎకరాలు అమ్ముకున్నానని గద్వాలకు చెందిన ఓ కార్యకర్త నేతలను నిలదీశారు. గ్రామ స్థాయిలో తాము ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా.. అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకున్నా ఏనాడూ తమను పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యకర్తకైనా న్యాయం చేశారా.. అని నిలదీశారు. పార్టీ కార్యకర్తను గుర్తించకుండా ఎలా గెలుస్తారు.. పార్టీ ఓటమికి అదే ప్రధాన కారణం. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని, కమిటీలు వేయాలని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేడర్‌కు మేము ఉన్నాం అని భరోసానిస్తే పార్టీ పటిష్టం అవుతుందని, లీడర్లు కార్యకర్తల మధ్య గ్యాప్‌ను తొలగించాలన అన్నారు. లేకపోతే ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పినట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలు జరిగి 45 రోజులు గడుస్తున్నా నేతల తీరు ఏమాత్రం మారలేదని ఆరోపించారు. గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పి మాట తప్పారు. మా వెంట ఉన్న అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించలేకపోయామని మండిపడ్డారు. వలస వచ్చిన వారికే పెద్దపీట వేశారు.. వారంతా ఇప్పుడు పదవుల కోసం మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కోసం పనిచేసిన కేడర్ ఇక్కడే ఉండిపోయామంటూ అధిష్టానాన్ని, నేతలను కేడర్ ఏకిపారేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story