Cabinet Expansion: టీ కాంగ్రెస్ లో మళ్లీ మొదటికి!.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2025-04-25 11:42:15.0  )
Cabinet Expansion: టీ కాంగ్రెస్ లో మళ్లీ మొదటికి!.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠ రేపుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 15 నేలలు దాటుతున్నా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ భర్తీ కొలిక్కి రావడం లేదు. గత నెలలో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖాయమైపోయిందని, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సైతం ఖరారైనట్లు వార్తలు వచ్చినా చివరి నిమిషంలో అధిష్టానం బ్రేకులు వేసింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ, పార్టీ శ్రేణుల్లో నిరాశ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మంత్రి వర్గ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

చర్చలు జరుగుతున్నాయి:

ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ నేపథ్యంలో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ మే లో పీసీసీ కమిటీ నియామకం జరగబోతున్నదని చెప్పారు. పదవుల భర్తీలో అనేక సమీకరణాలు ఉన్నాయని వాటన్నింటిని బేరీజు వేసుకుని భర్తీ చేయబోతున్నామని చెప్పారు. కేబినెట్ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని ఈ అంశం ఏఐఈసీ, ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న అంశం అన్నారు. మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉంటే ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని కొంత జఠిలంగా ఉందని అందుకే జాప్యం జరుగుతుందన్నారు. కులగణనకు అనుగుణంగానే మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) జరగాలని పీసీసీ చీఫ్ గా ఆశిస్తున్నానని ఇదే సమయంలో అనేక సమీకరణాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయని చెప్పారు.

ఇప్పట్లో జరిగేనా?:

కాంగ్రెస్ (Telangana Congress) లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. తమకు మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సిందేనని పలు జిల్లాకు చెందిన నేతలు బహిరంగ కామెంట్స్ చేయడం, మరికొంత మంది నేరుగా అధిష్టానం వద్దకే వెళ్లి రిక్వెస్టులు పెట్టుకోవడంతో అధిష్టానం సైతం ఎటు తేల్చలేని పరిస్థితి ఉందనే టాక్ వినిపించింది. దీంతో కొంతకాలంపాటు ఈ అంశాన్ని వాయిదా వేయడమే మంచిదనే అభిప్రాయానికి పార్టీ పెద్దలు రాగా మరో వైపు ఆశవాహులు మాత్రం తమ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం ఆసక్తిని రేపింది. ఓ వైపు నేతల ఆశల పల్లకి మరో వైపు అధిష్టానం వాయిదాల పద్దతితో మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేనా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.



Next Story

Most Viewed