తెలంగాణ ఇంటర్ ఫలితాలలో ఆ జిల్లాకు చివరి స్థానం

by Prasad Jukanti |
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో ఆ జిల్లాకు చివరి స్థానం
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. మొదటి సంవత్సరంలో 60.01 శాతం ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. 4,78,723 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. ఇందులో జనరల్ విభాగం నుంచి 4,30,413 మంది వొకేషనల్ విభాగం నుంచి 48,310 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో జనరల్ విభాగం నుంచి 2,62,829 (61.06 శాతం) మంది, వొకేషనల్ విభాగం నుంచి 24,432 (50.57శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలు కలిపి 5,02,280 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,22,432 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి అన్ లైన్ లో మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రీ కౌంటీగ్, రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్దులకు రేపటి నుండి మే 2 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఫలితాలను ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.inలో తెలుసుకోవచ్చు.

బాలికలదే పై చేయి:

ఎప్పటిలాగే ఈసారి ఫలితాలలో కూడా బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 68.35 శాతం మంది బాలికలు పాసవ్వగా 51.50 శాతం మంది బాయ్స్ ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 72 .53 మంది బాలికలు పాస్ కాగా 56.10 మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.

రంగారెడ్డి, ములుగు టాప్:

జిల్లాల వారీగా ఫలితాలు చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ప్రథమస్థానంలో రంగారెడ్డి జిల్లా, ద్వితీయ స్థానంలో మేడ్చల్ జిల్లాలు నిలిచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మొదటి స్థానంలో ములుగు, రెండవ స్థానంలో మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలలో చివరి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది. మొదటి సంవత్సరంలో అత్యధిక పాస్ పర్సంటేజ్ ఎంపీసీ (68.52 శాతం) గ్రూప్ నుంచి ఉండగా అతి తక్కువ పాస్ పర్సంటేజ్ హెచ్ఈసీ (31.57 శాతం) నమోదైంది. సెకండ్ ఇయర్ ఫలితాలలోనూ 73.58 శాతం పాస్ పర్సంటేజ్ తో ఎంపీసీ గ్రూప్ టాప్ లో నిలువగా 43.51 శాతం ఉత్తీర్ణతతో హెచ్ ఈసీ చివరి స్థానంలో నిలిచింది.

Advertisement

Next Story