TG SSC: ‘పది’ ప్రశ్నాపత్రాలపై ఇక క్యూఆర్ కోడ్..! సీరియల్ నంబర్ ముద్రణ

by Shiva |   ( Updated:2025-02-14 05:19:44.0  )
TG SSC: ‘పది’ ప్రశ్నాపత్రాలపై ఇక క్యూఆర్ కోడ్..! సీరియల్ నంబర్ ముద్రణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లలో అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఈ సారి పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ నంబర్ ను ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా పేపరు లీకైతే.. వెంటనే ఏ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకొని చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుంది. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మార్చి 21 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, గురుకులాల పాఠశాలలు కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

లీకేజీలకి ఆస్కారం లేకుండా..

పదోతరగతి పరీక్ష పేపర్లు లీకైతే వెంటనే గుర్తించడంతో పాటు అసలు లీకు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ముఖ్యమని ప్రధానోపాధ్యాయులు సూచిస్తున్నారు. నిజానికి పరీక్ష ప్రారంభానికి ముందే క్వశ్చన్ పేపర్ బయటకు వస్తే.. దాన్ని లీకేజీగా పరిగణిస్తారు. కానీ పరీక్ష ప్రారంభం తర్వాత బయటకు వస్తే లీకేజీగా పరిగణించకూడదు. అయితే ఆ పరీక్ష ముగిసేలోపు ప్రశ్నాపత్రం బయటకు రావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.

ఇంటర్ బోర్డులా హాల్ టిక్కెట్లు

రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ బోర్డు నుంచి హాల్‌టికెట్లు జారీ కాగానే.. వారిచ్చిన మొబైల్‌ నంబర్లకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) వచ్చేలా బోర్డు చర్యలు తీసుకుంది. అందులోని లింక్‌పై క్లిక్‌ చేసి నేరుగా హాల్‌టికెట్‌ పొందవచ్చు. దీనిద్వారా విద్యార్థులకు వెంటనే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి. దీంతో ఇదే తరహా ఏర్పాటును పదోతరగతికి విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తే సౌలభ్యంగా ఉంటుందని.. ఉపాధ్యాయుల, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈసారి మార్కుల విధానమే

గతంలో పదోతరగతి విద్యార్థులకు మార్కుల విధానం అమల్లో ఉండేది. దాన్ని తీసి గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే ఈసారి మళ్లీ.. గ్రేడింగ్‌కు బదులుగా మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు. 20 మార్కులు, ఇంటర్నల్స్, 80 మార్కులకు సబ్జెక్టుతో కలిపి 100 మార్కులకు పరీక్షలు ఉండనున్నాయి.

సీసీ కెమెరాలు ఏర్పాటు

పరీక్షల సమయంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వీటిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పర్యవేక్షించాలనే సూచనలు వస్తున్నాయి. పరీక్షా కేంద్రాల్లో గోడలు దూకి కాపీలు అందించకుండా.. కిటికీ పక్కన కూర్చొని పరీక్షలు రాస్తున్న వారి ప్రశ్నపత్రాలను మొబైల్‌ ఫోన్లతో ఫొటో తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. అవసరమైతే మహారాష్ట్ర తరహాలో సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పరీక్షల షెడ్యూల్ ఇదే..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 26న మ్యాథమెటిక్స్, మార్చి 28న ఫిజికల్ సైన్స్, మార్చి 29న బయలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 3న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 4న ఓరియంటెల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి.

Next Story

Most Viewed