- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టాదారులు @ 70 లక్షలు.. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ నివేదిక తేల్చింది ఇదే..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏటేటా భూ హక్కుదారుల సంఖ్య పెరుగుతున్నది. అదే సమయంలో సగటు హోల్డింగ్ విస్తీర్ణం పడిపోతున్నది. సగటున రెండు ఎకరాలు కూడా లేకుండాపోతున్నది. సక్సెషన్, సేల్ డీడ్స్, పార్టిషన్ డీడ్స్ పేరిట భూ పంపకం జోరుగా సాగుతున్నది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పట్టాదారుల సంఖ్య 50,23,861 ఉంటే.. ఇప్పుడు అది 70,60,000కి పెరిగింది. అంటే ఏడేండ్లలో 20 లక్షలకు పైగా కొత్త భూమి హక్కుదారులు పుట్టుకొచ్చారు.
స్కీమ్స్ తోడ్పాటుతో..
ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నది. రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. రైతుబంధు/రైతు భరోసా, రైతు బీమా వంటి స్కీమ్స్ తోడ్పాటునందిస్తుండడంతో భూమి ఉండాలన్న ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది స్థిరాస్తుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాల్లో నివాసముంటున్న వారు కూడా ఏదైనా ఊరిలో కొంతైనా వ్యవసాయ భూమి ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే గుంట నుంచి ఐదు గుంటల హక్కుదారుల సంఖ్య లక్షల్లో ఉన్నది. అతి తక్కువ విస్తీర్ణంలో ఏ పంట పండించినా ఆర్థిక తోడ్పాటు అందకపోవచ్చు. కానీ రైతుగా గుర్తింపు పొందే వెసులుబాటు కలుగుతున్నది. పైగా రైతుబీమా కూడా అమలవుతుండటంతో ఇన్సూరెన్స్ మాదిరిగా పనికొస్తుందన్న భావన ఏర్పడింది.
సోషల్ స్టేటస్ గానూ..
ఒకప్పుడు రైతు, రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు నాకూ వ్యవసాయ భూమి ఉందని చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం ఉంటే సోషల్ స్టేటస్‌గా ఫీల్ అవుతున్నవారు చాలా మందే ఉన్నారు. సాధారణ ప్రైవేటు ఉద్యోగి నుంచి లక్షల్లో వేతనం పొందే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, నాల్గో తరగతి ఉద్యోగి నుంచి ఐఏఎస్ అధికారి వరకు తమకూ ల్యాండ్ ఉండాలని కోరుకుంటున్నారు. దాదాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి. అటు వ్యవసాయం చేస్తున్నామంటూనే వీకెండ్ ఎంజాయ్ కోసం అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లు కూడా ఫాంహౌజ్‌లలోనే చేసేందుకు ఇష్టపడుతున్నారు. నగరాల్లో ఉండే వారే కాకుండా.. జిల్లా, మండల కేంద్రాల్లో ఇతర పనులు, వృత్తుల్లో ఉన్న వారు కూడా వ్యవసాయ భూమి వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే రెండు గుంటల వ్యవసాయ భూమి తమకు ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. అందుకే ఈ నాలుగేండ్లల్లో అతి తక్కువ భూమితో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల సంఖ్య లక్షల్లో ఉన్నది. గుంట నుంచి ఐదు గుంటల వరకు భూ విస్తీర్ణంతో కూడిన రైతుల సంఖ్య పెరిగింది.
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ -2024 ప్రకారం..
విస్తీర్ణం పట్టాదారులు శాతం మొత్తం విస్తీర్ణం(ఎకరాల్లో)
2.47 ఎకరాల్లోపు 48,47,000 68.7 51,08,000
2.48–4.94 లోపు 16,00,000 22.7 55,28,000
4.95–9.88 లోపు 5,05,000 7.1 32,05,000
9.89–24.77 లోపు 99,000 1.4 13,52,000
24.78 కి పైగా 9,000 0.1 4,05,000
మొత్తం 70,60,000 100 1,55,97,000
రైతుబంధు పొందుతున్న రైతుల వివరాలు
విస్తీర్ణం రైతుల సంఖ్య
ఎకరం లోపు 24,24,870
2 ఎకరాల లోపు 17,72,675
3 ఎకరాల లోపు 11,30,788
4 ఎకరాల లోపు 6,54,419
5 ఎకరాల లోపు 4,92,568
5 ఎకరాలకు పైగా 4 లక్షలకు పైగానే
మొత్తం 68,75,320
2021 జూలైలో రైతుల సంఖ్య
విస్తీర్ణం రైతుల సంఖ్య
2.20 ఎకరాల్లోపు 39,52,232
2.20 నుంచి 3 ఎకరాలు 4,70,759
3 నుంచి 5 ఎకరాలు 11,08,193
5 నుంచి 7.20 ఎకరాలు 3,49,382
7.20 నుంచి 10 ఎకరాలు 1,15,916
25 ఎకరాలకు పైగా 9000
పెరుగుతున్న పట్టాదారుల సంఖ్య ఇలా..
సంవత్సరం పట్టాదారుల సంఖ్య
2018–19 50,23,861
2019–20 51,61,022
2020–21 58,01,594
2021–22 60,95,134
2023–24 68,75,320
2024–25 70,60,000
ఐదేండ్లల్లో పెరిగిన సన్నకారు రైతులు
2015–16 నుంచి 2021–22 వరకు సన్నకారు రైతుల సంఖ్య పెరిగింది. అంతకు ముందు 38.40 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 48.47 లక్షలకు చేరింది. అలాగే 2.48–4.94 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతుల సంఖ్య కూడా 14.09 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగింది.
-4.95–9.88 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతుల సంఖ్య 5.64 లక్షల నుంచి 5.05 లక్షలకు తగ్గింది.
-9.89–24.77 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతుల సంఖ్య 1.26 లక్షల నుంచి 99 వేలకు పడిపోయింది.
-అదే 25 ఎకరాలకు పైగా ఉన్న వారి సంఖ్య మాత్రం 9 వేలు స్థిరంగా ఉన్నది.
-ఈ ఏడాది లెక్కలు తీస్తే రెండెకరాల లోపు భూమి ఉన్న వారి సంఖ్య మరో 5 లక్షలు పెరిగి ఉంటుందని అంచనా.