- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐకు సర్కార్ జై.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు!
అడ్మినిస్ట్రేషన్ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నది. త్వరలోనే ఆ కంపెనీకి చెందిన నిపుణుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరపనున్నది. ఈ మీటింగ్ తర్వాత ఏఐ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై స్పష్టత రానున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు.. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నూ (ఏఐ) వాడుకోవాలనుకుంటున్నది. రోజువారీ పాలనా అవసరాలకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నది. అందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో వినియోగంలోకి వచ్చిన చాట్ జీపీటీలోని టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టింది. త్వరలో ఆ కంపెనీకి చెందిన నిపుణుల బృందం హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరపనున్నది.
ఈ మీటింగ్ తర్వాత ఏఐ టెక్నాలజీని అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై స్పష్టత రానున్నది. ఏఐను పరిపాలనాపరమైన అవసరాలకూ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే బ్లాక్ చైన్ టెక్నాలజీని కొన్ని అవసరాలకు వాడుతున్నామని గుర్తుచేశారు. కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్న టైంలోనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సైతం అడాప్ట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో వీలైనంత ఎక్కువగా డిజిటల్ వినియోగం ఉండాలని భావించామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దానికి తగినట్లుగానే సచివాలయంలోని చాంబర్లు, వర్క్ స్టేషన్ల డిజైన్ జరిగినట్టు వివరించారు.
రెండేండ్లుగా..
ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న టెక్నాలజీల్లో ఏఐ కూడా ఒకటని, భవిష్యత్తు ఈ టెక్నాలజీదేనంటూ గతేడాది జూలైలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో అనేక అంశాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతుందని, అనేక రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ రంగంలో కనీసంగా లక్ష మంది హైస్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు అందించే తరహాలో శిక్షణ అందిస్తామని, ఇందుకోసం ఒక స్కీమ్‌ను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ‘టాస్క్’ (తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జి) ద్వారా వేలాది మంది విద్యార్థులకు, వివిధ కాలేజీల్లోని ఫ్యాకల్టీకి జాబ్-రెడీ స్కిల్స్‌లో శిక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ ఇండియా, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌ల సంయుక్త సహకారంతో అప్లయిడ్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్’ను నెలకొల్పింది. రానున్న కాలంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యార్థులకు ప్రత్యేక ట్రెయినింగ్ ఇవ్వాల్సిన ప్రాధాన్యంపై కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో అడ్మినిస్ట్రేషన్ అవసరాలకూ ఏఐ టెక్నాలజీని వాడడం ద్వారా పనుల్లో కొంత వేగం పెరిగే చాన్స్ ఉందనే చర్చలు అధికారుల స్థాయిలో జరుగుతున్నాయి. ఐటీ శాఖ అధికారులు నిర్దిష్టంగా ఏ రూపంలో ఏఐ టెక్నాలజీని రోజువారీ పరిపాలనా అవసరాలకు వాడుకోవాలన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ పలు దేశాల్లో పైలట్ ప్రాతిపదికన వాడుతున్న అనుభవాలను స్టడీ చేస్తున్నారు.
మెరుగైన సేవల కోసం..
చాలా దేశాల్లో ఏఐ టెక్నాలజీ అవసరాలు పెరుగుతున్నాయి. చాలామంది వ్యాపారవేత్తలు కూడా దీనిపై దృష్టి పెట్టారు. రానున్న 12 సంవత్సరాల్లో మన దేశ ఎకానమీలోకి సుమారు వెయ్యి బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ఆర్థికవేత్తల అంచనా. ఇప్పటికే పలు ప్రయివేట్ సంస్థలు, బ్యాంకులు చాట్‌బోట్ రూపంలో 24 గంటలు సేవలందించడానికి ఏఐ టెక్నాలజీని వివిధ రూపాల్లో వాడుతున్నాయి. భారత్‌లో కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు (ఐఆర్‌సీటీసీ) సైతం దీన్ని వినియోగిస్తున్నాయి. ఇకపైన అనేక సంస్థలు ఇదే బాటను అనుసరించాలన్నది కేంద్ర ప్రభుత్వ వర్గాల ఆలోచన.
డిజిటల్ లావాదేవీలు పెరిగినందున వినియోగదారుల వివరాలను నిర్వహించేందుకు క్లౌడ్ డాటా సెంటర్లు సైతం విస్తృతంగా ఉన్నందున రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ సాధారణమైపోతుందన్నది నిపుణుల భావన. వైద్యారోగ్యం, పట్టణ రవాణా, మొబిలిటీ రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగంతో విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్నది ఐఏఎస్ అధికారుల అభిప్రాయం. రేషను దుకాణాల మొదలు ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల వరకు డిజిటల్ పరిజ్ఞానం పెరిగినందున ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ప్రభుత్వాలు సైతం ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. పరిపాలనలో ఏఐ టెక్నాలజీని వాడడం ద్వారా సత్వర, మెరుగైన సేవలను అందించొచ్చన్నది రాష్ట్ర ఐటీ శాఖ అధికారుల భావన.
దీనికి మించి సైబర్ దాడుల నుంచి సెక్యూరిటీ కల్పించడానికి, ప్రభుత్వ డాటా చోరీ కాకుండా నివారించుకోడానికి అల్గారిథమ్ వినియోగంతో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రోజువారీ పరిపాలనలో పలు రాష్ట్రాల్లో ‘స్మార్ట్’ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఫైల్స్ మూమెంట్‌కు ఉపయోగపడుతున్నది. ఇకపై ఆ పాత్రను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించనున్నది. మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి ఐటీ శాఖ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని ఎలాంటి అవసరాలకు ఉపయోగించుకోనున్నదో క్లారిటీ వస్తుంది. ఏ రంగాల్లో వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, దానికి అనుగుణంగా కంప్యూటర్ అప్లికేషన్ల రూపకల్పన తదితరాలపై ఫోకస్ పెట్టడానికి వీలు కలుగుతుంది.
Read more:
అక్కడ KCR.. ఇక్కడ KTR.. బీఆర్ఎస్ బలోపేతంపై తండ్రి కొడుకుల ఫోకస్!