అక్కడ ఉండటం అసాధ్యం.. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ వేళ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-07-21 13:07:29.0  )
అక్కడ ఉండటం అసాధ్యం.. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ వేళ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన కాషాయ దళపతిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మరోసారి టీ బీజేపీలో లుకలుకలను బయపడేసింది. ఈ కార్యక్రమంలో కొందరు లీడర్లు చేసిన వ్యాఖ్యలు టీ బీజేపీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయడం ఆపండని.. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ బీజేపీలోని అసంతృప్తి నేతలపై పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తెలంగాణ బీజేపీ కీలక నాయకురాలు విజయశాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నుండి మధ్యలోనే వెళ్లిపోవడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో.. నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు స్టేజీపై ఉన్నారని ఆమె అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు అక్కడ స్టేజీపై ఉండటంతో.. తాను అసౌకర్యంగా ఫీల్ అయ్యాయని విజయశాంతి తెలిపారు. అలాంటి స్టేజీపై చివరకు ఉండటం అసాధ్యమని.. అందుకే తాను ఆ కార్యక్రమం మధ్యలో నుండి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె వివరించారు. అయితే, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

Read more : disha newspaper

Next Story