'ధరణి'లో మళ్ళీ సాంకేతిక సమస్యలు

by M.Rajitha |
ధరణిలో మళ్ళీ సాంకేతిక సమస్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) చేతుల్లోకి వెళ్లినా.. ఇప్పటికీ ‘టెర్రాసిస్’ ఎఫెక్ట్ తప్పడం లేదు. అనేక టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతుండడంతో పోర్టల్ నిర్వహణలో ఎన్ఐసీ సిబ్బందికి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు, మ్యుటేషన్లు ముందుకు సాగడం లేదు. ఆఖరికి అప్లికేషన్ల పరిష్కారం కూడా పెండింగులో పడింది. గడిచిన మూడు రోజులుగా స్లాట్స్ బుక్ కావడం లేదు. డిజిటల్లీ నాట్ సైన్డ్, సర్వే నంబర్ సబ్ డివిజన్ కాలేదని, ఇలా వివిధ కారణాలు చూపిస్తున్నది. ఇదే విషయాన్ని సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరందు దృష్టికి తీసుకెళ్తే కొందరికే సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

డేటా ట్రాన్స్ ఫర్ అయినా.. టెక్నికల్ ఇష్యూస్

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టు నుంచి ఐఎల్ఎఫ్ఎస్ (తర్వాత టెర్రాసిస్)ను రెవెన్యూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులు తప్పించారు. మూడేండ్ల పాటు ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి డేటా బదిలీ చేశారు. అయితే పోర్టల్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా టెర్రాసిస్ చూడాలి. కానీ అనేక కొత్త సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుక్ చేసేటప్పుడు ఓ సారి ఓటీపీ సమస్య ఉత్పన్నమవుతున్నది. మరో సారి ఏ సర్వే నంబరు భూమిని అమ్మకానికి పెడుతున్నారో, దానికి డిజిటల్ సంతకం కాలేదని, సర్వే నంబర్ సబ్ డివిజన్ కాలేదంటూ వస్తున్నది. నిజానికి ఆయా సర్వే నంబర్లలో ఎలాంటి సమస్య లేదు. ధరణి ల్యాండ్ డిటెయిల్స్ సెర్చ్ చేస్తే క్లియర్ గానే ఉన్నది. ఇలా మార్చి మార్చి స్లాట్ బుక్ చేసినా అదే రిపీట్ అవుతున్నది. ఒక మండలం అనుకుంటే మరో మండలం డేటాని తీసుకున్నా అలాగే దర్శనమిస్తున్నది. ఇలా మూడు రోజుల నుంచి సమస్య వస్తున్నట్లు మీ సేవా కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు. క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్స్ పైనా డిజిటల్ సంతకం కాలేదని, సర్వే సబ్ డివిజన్ కాలేదంటూ దర్శనమిస్తున్నాయి. ఎలాంటి వివాదాలు లేని భూములకు స్లాట్స్ సరైన టైంకి బుక్ కాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. భూమిని కొనుగోలు చేయాలనుకునే వారికి డౌట్స్ వస్తున్నాయంటున్నారు. ఏదీ లేకపోతే స్లాట్ ఎందుకు బుక్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. దాంతో ఏం సమాధానం చెప్పలేకపోతున్నామని మీసేవ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనా సమస్య వచ్చిందని సీఎమ్మార్వో పీడీ దృష్టికి తీసుకెళ్లగానే స్పందిస్తున్నారు. ఆ ఇష్యూ గురించి టెక్నికల్ స్టాఫ్ కి చేరవేస్తున్నారు. కానీ ఆయన దాకా సమస్యను అందరూ తీసుకెళ్లడం కష్టం. సాంకేతిక సమస్యలు తలెత్తగానే ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఎవరు పరిష్కరిస్తారో ఎవరికీ తెలియదు.

కొత్త పోర్టల్ వస్తేనే..

టెర్రాసిస్ సృష్టించిన సాఫ్ట్ వేర్, పోర్టల్ ను యథాతథంగా వాడడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆ పని చేస్తామని చెప్పింది. కానీ ఏడాదైనా అదే కొనసాగించాల్సి వస్తున్నది. ధరణి పోర్టల్ 35 మాడ్యూళ్లతో గందరగోళం నెలకొన్నది. దీన్ని తగ్గిస్తామని, ఏ సమస్య వచ్చినా ఒక్క దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు.. వివిధ మాడ్యూళ్లు అనేవి ఏమీ ఉండవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. సింగిల్ విండో వ్యవస్థనే ఉంటుందని, ఆ తర్వాత దరఖాస్తును పరిశీలించి ఏ అధికారి పరిష్కరించాలో, సదరు ఆఫీసర్ లాగిన్ కి వెళ్లేటట్లుగా చేస్తామన్నారు. తక్కువ మాడ్యూళ్లతోనే మెరుగైన భూ పరిపాలన సేవలు అందిస్తామన్నారు. పైగా ఏ సమస్య ఉన్నా దరఖాస్తు చేసుకునేందుకు ఒకే మాడ్యూల్ ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడా వ్యవస్థను రూపొందించేందుకు కొత్త పోర్టల్ ను రూపొందించుకోవడం బెటర్. టెర్రాసిస్ క్రియేట్ చేసిన దాని కంటే కొత్త దాన్ని ఎన్ఐసీ చేతనే రూపొందించడం ద్వారా టెక్నికల్ ఇష్యూస్ ని కూడా అడ్రెస్ చేయడం ఈజీ అవుతుందన్న అభిప్రాయం నెలకొన్నది. ఎవరో తయారు చేసిన అప్లికేషన్లను వినియోగించుకుంటూ మెరుగైన సేవలందించడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు.

Next Story

Most Viewed