తనతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు షర్మిల లేఖ

by GSrikanth |   ( Updated:2023-03-02 07:47:01.0  )
తనతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు షర్మిల లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాలకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖలు రాశారు. అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని ప్రతిపక్ష నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కుంటోందని తెలిపారు. అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకోసం విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగువేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

కేసీఆర్ సర్కారు పాలనలోని వైఫల్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకూ దిగజార్చుతోందని విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో అవినీతికి పాల్పడిన వైనాన్ని చూస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసులు మోపుతున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో, రీడిజైనింగ్ పేరుతో వేలాది కోట్ల రూపాయలను దోచేస్తున్న కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఐక్యంగా గళమెత్తాలని వైఎస్సార్టీపీ చీఫ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండరాం, కాసాని జ్జానేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అసదుద్దిన్ ఓవైసి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంభశివరావు, ఎన్ శంకర్ గౌడ్, మందక్రిష్ణ మాదిగ గార్లకు లేఖలు రాశారు.

Advertisement

Next Story