టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దేశంలోనే అతిపెద్ద స్కాం.. గవర్నర్కు షర్మిల బహిరంగ లేఖ

by Javid Pasha |   ( Updated:2023-04-19 11:44:09.0  )
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దేశంలోనే అతిపెద్ద స్కాం.. గవర్నర్కు షర్మిల బహిరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఎస్సీ లీకేజీ దేశంలోని అన్ని కమిషన్లలో జరిగిన అతి పెద్ద స్కాం అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలు చేశారు. ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్ పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, కొత్త బోర్డును వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి బుధవారం షర్మిల బహిరంగ లేఖ రాశారు. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్ష పేపర్లు అమ్మి 30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు.

ఈ లీకుల వెనుక బోర్డు చైర్మన్, మెంబర్లు, ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల వరకు హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా ఇలా జరగడం అసాధ్యమని లేఖలో పేర్కొన్నారు. లీకేజీలతో టీఎస్ పీఎస్సీ విశ్వసనీయతను కోల్పోయిందని, విచారణకు నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని వెల్లడించారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరు వ్యక్తులే పేపర్ లీక్ చేశారని జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారని, దర్యాప్తునకు ముందే దోషులు ఎవరనేది తేల్చేశారని ఆమె విమర్శలు చేశారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed