- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ చరిత్రలో ఆరోజు కీలకం.. సంబురాలకు సిద్ధమైన ప్రధాన పార్టీలు?
సెప్టెంబర్ 17.. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు.. నిజాం పాలన కింద ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్‌లో కలిసిన తేదీ.. దాదాపు 75 ఏళ్లుగా కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న ప్రాంతాల్లో ఈ తేదీ రోజున సంబరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఈ ఉత్సవాలు జరగడం లేదు. తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని పొలిటికల్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. పేర్లు వేరైనా ఈ సారి సెప్టెంబర్ 17 గ్రాండ్ గా జరుగనుంది. మజ్లిస్ సైతం ఈ ఉత్సవాలకు రెడీ కావడం విశేషం. ఎందుక రాజకీయ పక్షాలన్నీ ఒకే రాగం అందుకున్నాయి..? ఆ పార్టీల నేతల వ్యూహం ఏంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్ లో విలీనమై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహించాలనుకుంటున్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని పొలిటికల్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఏడాది పొడవునా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యాయి. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు ఏనాడూ అధికారికంగా జరగని ఉత్సవాలు ఈసారి గ్రాండ్‌గా నిర్వహించేందుకు రాజకీయ పక్షాలు పోటీ పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ ఉత్సవాలను పోటాపోటీగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. పార్టీలు సైతం అదే బాటపట్టాయి. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున రాజకీయ లబ్ధి కోసం ప్రధాన పార్టీలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. ఉత్సవాలు నిర్వహించని పక్షంలో ప్రజలకు దూరమవుతామన్న భావన ఆయా పార్టీల నేతలను వెంటాడుతున్నది. దీంతో కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు విలీన వజ్రోత్సవాల పేరుతో నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సైతం విమోచన అమృత్ మహోత్సవ్ పేరుతో సంవత్సరం పాటు జరపనున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఈ నెల 16-18 తేదీల్లో మూడు రోజుల ప్రారంభ వేడుకలను నిర్వహిస్తున్నది. వచ్చే ఏడాది సెప్టెంబరులో మూడు రోజుల ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ సైతం 'నిజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవాలు' పేరుతో ఏడాది పాటు జరిపేలా కార్యాక్రమాన్ని రూపొందించింది. రిటైర్డ్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గతంలో వేడుకలు జరపడానికి సిద్ధం కాని పార్టీలు, ప్రభుత్వాలు ఈసారి పోటీపడి మరీ నిర్వహించడం వెనక ఏకాభిప్రాయం కన్నా రాజకీయ ప్రయోజనాలే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
విమోచన అంటున్న బీజేపీ
హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర భారత యూనియన్‌లో విలీనం చేసి నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడానికి అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ చొరవ తీసుకున్నారని, అందువల్ల ప్రతీ ఏటా సెప్టెంబరు 17ను విమోచనా దినోత్సవంగా జరపాలని బీజేపీ డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ చేస్తూ ఉన్నది. సమైక్య రాష్ట్రంలో తొలుత 1990లోనే తాము గొంతు విప్పామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే అధికారికంగా విమోచన ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తొలిసారి జరుపుతున్నందున గ్రాండ్‌గానే ఉండేలా రాష్ట్ర బీజేపీ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది.
కాంగ్రెస్ 'విలీన' మంత్రి
కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వీలిన దినోత్సవంగా జరుపుకోవాలని, ఏడాది పాటు జరుపుతామని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైనందున దాన్ని ఆ పేరుతోనే జరపాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్ దీన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విలీన వజ్రోత్సవాల పేరుతో ఈ వేడుకలను సంవత్సరం పాటు జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో పేరుతో వీటిని నిర్వహిస్తున్నా రూ. 5 వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వేడుకలను ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినా కేసీఆర్ మాట తప్పి ఏనాడూ జరపలేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సెప్టెంబరు 17 సందర్భాన్ని మతంతో ముడిపెడతాయని, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని, కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ ఉత్సవాలను అప్పటి నిజాం నిరంకుశత్వం కారణంగా మన పూర్వీకులు ఎలాంటి ఇబ్బందులు, బాధలు పడ్డారో ఇప్పటి తరం ప్రజలకు అర్థం చేయించాలని కోరారు.
తెరపైకి మజ్లిస్..
గతంలో ఎన్నడూ సెప్టెంబరు 17 వేడుకను నిర్వహించడానికి సమ్మతించని మజ్లిస్ పార్టీ ఈసారి ముందుకొచ్చింది. నిజాం పాలనను నిరంకుశమైనదేనంటూ వ్యాఖ్యానించడంతో పాటు హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారతంలో కలిసిపోయినందున జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బీజేపీకి పొలిటికల్ మైలేజీ ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో మజ్లిస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో సెప్టెంబరు 17న తిరంగా యాత్ర నిర్వహించాలని శ్రేణులకు అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఒవైసీ నుంచి వచ్చిన విజ్ఞప్తితో టీఆర్ఎస్ సైతం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వమే అధికారికంగా 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు'పేరుతో నిర్వహించేలా మంత్రివర్గం తీర్మానించింది.
అందరి దృష్టీ ఎన్నికలపైనే..
ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని పార్టీలూ ఈ వేడుకలకు జై కొట్టాయి. ఏ పార్టీ ఒప్పుకున్నా లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడంతో పొలిటికల్ మైలేజీని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలూ ఈ తరహా నిర్ణయం తీసుకోక తప్పలేదు. వీటిని నిర్వహించకపోతే ఓటు బ్యాంకు మీద ప్రభావం పడుతుందనేదే ఆ పార్టీల భావన. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పటివరకూ దాన్ని నిర్వహించకపోవడానికి పలు రకాల కారణాలను తెరపైకి తెచ్చింది. దానికి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ సైతం తన రాజకీయ ప్రయోజనాలతో వ్యతిరేకించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలూ ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అన్నదాత మృత్యు ఘోష.. ఏడేండ్లలో 5 వేల మంది ఆత్మహత్య
TRS నేతల్లో కాన్ఫిడెన్స్ డౌన్.. స్వయంగా KCR మాటల్లోనే తేటతెల్లం?