ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం లేదా మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది దర్యాప్తు సంస్థల పరిధిలోని అంశమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆమెను అరెస్టు చేసేటట్లయితే అది కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అంశంగానే చూడాలి తప్ప బీజేపీకి అంటగట్టడం సమంజసం కాదన్నారు.

కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే ఆమె అరెస్టుకు సంబంధించి సీబీఐ, ఈడీ అధికారులు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో 30% కమిషనర్ సర్కారు నడుస్తున్నదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్వంతంగా 303 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని నొక్కిచెప్పారు. గులాబీ పార్టీని ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకే గూటి పక్షులని, అవి రెండు లోపాయకారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ కారణంగానే కర్ణాటక ప్రభుత్వం కొలువుదీరే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కు ఆహ్వానం అందలేదన్నారు.

కాంగ్రెస్‌ను గెలిపించడం కోసమే జేడీఎస్ ఓట్లు ఆ పార్టీకి మళ్ళేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో ఈ రెండు పార్టీలూ కలిసి ప్రయత్నాలు చేశాయన్నారు. ఈ రెండు పార్టీలో ఒక్కటేనని ఆరోపించిన లక్ష్మణ్.. బీఆర్ఎస్‌తో కలిసే పరిస్థితి రావచ్చంటూ కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెప్తున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30 నుంచి ప్రతి ఊరినీ టచ్ చేయాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మహా సంపర్క్ అభియాన్ పేరుతో ప్రధాని మొదలు బూత్ స్థాయి కార్యకర్త వరకు అభివృద్ధి నివేదిక రూపంలో ప్రజలకు దగ్గరవుతున్నామన్నారు. తెలంగాణాలో రైల్వేల అభివృద్ధికి రూ. 4,400 కోట్లు విడుదల చేసిందని, స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా వరంగల్, కరీంనగర్ నగరాలకు రూ. 1,000 కోట్లు రిలీజ్ అయ్యాయని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఒక్కో యూనిట్‌కు కేంద్రం నుంచి ఒకటిన్నర లక్ష రూపాయల చొప్పున విడుదలయ్యాయన్నారు. రైతు ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపోయిన రైతులకు సాయాన్ని అందించలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed