ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలి.. : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Rajesh |
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలి..   : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కాంగ్రెస్ సర్కారు రైతు బంధు అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారని గుర్తు చేశారు.

రైతు బంధు సాయంతో పాటు కేసీఆర్ రెండు విడతలుగా రైతు రుణమాఫీ చేశారన్నారు. రెండు లక్షల రుణ మాఫీని డిసెంబర్ 9నే పూర్తి చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రగల్భాలు పలికిందన్నారు. తర్వాత మార్చి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం జూలైలో రుణ మాఫీ మొదలు పెట్టిందన్నారు. లక్ష లోపు రుణ మాఫీకి ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.6 వేల కోట్లు మాత్రమే అని..లక్షన్నర లోపు రుణాలకు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే అన్నారు. రైతు భరోసా అమలు చేస్తే రూ.30 వేల కోట్లు అవుతుందన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. కేసీఆర్ రైతు బంధు కింద ఒక విడతకు ఇచ్చిన మొత్తం రూ.7300 కోట్లని

స్పష్పం చేశారు. తాము రుణమాఫీ చేసినపుడు ఇప్పటిలాగా పేపర్లలో యాడ్‌లు ఇచ్చుకోలేదన్నారు. ఒక్కో విడతకు పేపర్ ప్రకటనల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కేసీఆర్ ఇలాంటి ప్రకటనలకు అపుడు దూరంగా ఉన్నారని తెలిపారు. రైతుల సంబరాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. బ్యాంకుల దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న సాకులతో రైతు రుణ మాఫీని ఎగ్గొడుతున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గ్రామాల్లో లక్ష లోపు రుణ మాఫీ కాని వారు చాలా మంది ఉన్నారన్నారు. గ్రామాలకు కాంగ్రెస్ నేతలు వస్తారా ? రుణ మాఫీ కాని వాళ్ళను చూపిస్తామన్నారు. మాటల్లో ఏ కొర్రీలు లేవంటున్నారు.. క్షేత్ర స్థాయిలో అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం మీద రైతులు భ్రమలు తొలగించుకోవాలన్నారు.

ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఓ విజ్ఞప్తి చేయదలుచుకున్నామని.. అర్హులై ఉండి ఇప్పటి దాకా లక్ష, లక్షన్నర లోపు రుణాలు మాఫీ కాని వారు ఫిర్యాదులు చేసేందుకు తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రుణ మాఫీ కాని రైతులు మొబైల్ నెంబర్ 8374852619 కు వివరాలు వాట్సాప్ ద్వారా చేరవేయాలని సూచించారు. మాకు వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. రైతుల సంఖ్యపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెబుతోందన్నారు. 60 లక్షల మందికి పైగా రైతులు రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతోందన్నారు. రైతుల సంఖ్య ఎందుకు మాయమైందని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రుణ మాఫీకి ఇంకా రూ.18 వేల కోట్లు కావాలని.. ఈ డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి డాలర్ల రూపం లో తెస్తారా ఏమో చూడాలని సెటైర్లు వేశారు. రైతు భరోసా నే కాదు.. ఎవ్వరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో భరోసా లేదన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ప్రభుత్వం దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అని ఎద్దేవా చేశారు. రైతు భరోసాపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఏమైందని ప్రశ్నించారు. కేబినేట్ సబ్ కమిటీ రిపోర్టు ఏమైందని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed