బుద్వేలులో రూ.400 కోట్ల స్కామ్.. తెర వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు!

by GSrikanth |   ( Updated:2024-04-21 15:11:34.0  )
బుద్వేలులో రూ.400 కోట్ల స్కామ్.. తెర వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల నుంచి భూమిని లాక్కున్నారు. చట్ట విరుద్ధమని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు న్యాయం చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఐతే దాంతో డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ తాము చెప్పిన వాళ్లకే.. ఇచ్చిన రేటుకే అమ్మాలన్నారు. దాంతో గజం రూ.లక్ష పలికే చోట రూ.10,200 ఇస్తే మౌనంగా సంతకాలు చేశారు. అది కూడా రాదేమోనని భయపడ్డారు.. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం, కొందరు మధ్యవర్తులు కలిసి దళిత అసైనీలకు చేసిన అన్యాయం. ఇందులో సీసీఎల్ఏ నుంచి తహశీల్దార్ వరకు అందరూ ప్రైవేటు కంపెనీలకు సంపూర్ణ సహకారం అందించారు. దాంతో ఇతరులకు ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు అమ్మకుండా కన్వెయన్స్ డీడ్స్ ఇచ్చిన వెంటనే రియల్ ఎస్టేట్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేయించారు. దీని ద్వారా రూ.వందల కోట్ల భూమిని ప్రైవేటు కంపెనీల వశమయ్యాయి. ఇదెక్కడో కాదు.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలు(అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కనే)లోనే జరిగింది. పేదల నుంచి భూములను గుంజుకొని హెచ్ఎండీఏ వేలం వేసి రూ.3 వేల కోట్లు ఆర్జించింది. నిజానికి ఈ భూముల అమ్మకం చట్ట ప్రకారం చెల్లనే చెల్లదంటున్నారు.

ది తెలంగాణ ల్యాండ్ రీఫామ్స్ (సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్) యాక్ట్, 1973 ప్రకారం సీలింగ్ భూములను అమ్మే అధికారం హెచ్ఎండీఏకు లేదని న్యాయ నిపుణులు, రెవెన్యూ మాజీ అధికారులు అంటున్నారు. ఇది ప్రభుత్వ భూమి కాదు.. అత్యధికంగా కలిగి ఉన్న వ్యక్తి నుంచి సీలింగ్ కి మించిన భూమిని హ్యాండోవర్ లేదా స్వాధీనం చేసుకున్న భూమి మాత్రమే. ఈ భూమిని పేదలకు పంచడం తప్ప అమ్మడం చట్టరీత్యా చెల్లదంటున్నారు. ఈ చట్టం ప్రకారం గరిష్టంగా క్లాస్ కె కింద 54 ఎకరాలకు మించి ఒక హోల్డింగ్ ఉండరాదు. మిగతాది సీలింగ్ కింద ప్రభుత్వపరం అవుతుంది. ఈ భూమిని రీ అసైన్ చేయడం లేదంటే ఇండ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి మాత్రమే పరిమితమైంది. సుదీర్ఘ కాలంగా కేసులు నడిచిన ఈ భూమిని అసైనీల నుంచి స్వాధీనం చేసుకున్నదన్న విషయం అందరికీ తెలిసింది. ఆ బాధితులకు 800, 200 గజాల వంతున ప్లాట్లు ఇచ్చే ఒప్పందం ప్రకారమే సెటిల్మెంట్ కుదిరింది. అంతకు ముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటప్పుడు నిర్మాణ సంస్థలకు వారి ఇష్టమొచ్చినట్లు వినియోగించుకునే హక్కులు కల్పిస్తూ అమ్మకాలు చేయడం అన్యాయమంటున్నారు. దళిత అసైనీలకు అన్యాయం చేసి రియల్ ఎస్టేట్ కంపెనీలకు మేలు కలిగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అదే రోజే ఎట్లా సాధ్యం?

సామాన్యులెవరైనా రిజిస్ట్రేషన్ కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేసిన మరుసటి రోజు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ మాత్రం తహశీల్దార్ పెద్ద గేమ్ ఆడారు. అసైనీల పేరిట కన్వెయన్స్ డీడ్ చేసిన మరుక్షణమే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సేల్ డీడ్ చేశారు. కన్వెయన్స్ డీడ్స్ డాక్యుమెంట్ ఎప్పుడు సిద్ధం చేశారు? ఎంత టైం పట్టింది? స్లాట్స్ బుక్ చేయడానికి అదే నిమిషంలో ఎలా సాధ్యమైంది? తహశీల్దార్ కి అంత ఆసక్తి ఎందుకు? అసలేం జరిగింది? దీని వెనుకున్న పెద్ద పొలిటిషియన్లు ఎవరు? వాళ్ల మాట ఎందుకు విన్నారు? నిబంధనలను ఉల్లంఘిస్తూ వారి కోసం పని చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన మెమో నం.9053/రిజిస్ట్రేషన్–1/2023, తేదీ.17.4.2023 ప్రకారం ప్రభుత్వం ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసే అధికారం కలెక్టర్ కి ఇచ్చింది. కానీ దానికి వ్యతిరేకంగా రాజేంద్రనగర్ తహశీల్దార్ కె.చంద్రశేఖర్ కన్వెయన్స్ డీడ్స్ చేయడం గమనార్హం. అంటే ఉద్దేశ్యపూర్వకంగా కలెక్టర్ ఇరుక్కోకుండా తహశీల్దార్ చేత ఎగ్జిక్యూట్ చేయించారని తెలుస్తున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ తప్పించుకునేందుకే ఈ తతంగం తహశీల్దార్ కార్యాలయం నుంచి నడిపించారు.

ఎంత నష్టం?

హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం భూ యజమానులకు 60 శాతం అంటే ఎకరానికి సుమారు 1741 గజాలు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలి. కానీ వారి పేరిట ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం 800 గజాలు మాత్రమే ఇచ్చారు. ఒక్కో అసైనీకి 4 ఎకరాలు కూడా ఉండేది. ఆ ఇచ్చిన ప్లాట్ ని కూడా వేరే వాళ్లకు అమ్మకుండా చేశారు. గజానికి రూ.10,200 మాత్రమే వచ్చింది. దీని వల్ల గజానికి లక్షకు బదులుగా రూ.10,200 రావడం తీరని నష్టానికి దారి తీసింది. ప్రభుత్వం వేలం వేస్తే సరాసరిన రూ.3625 కోట్ల ఆదాయం వచ్చింది. 66 మంది అసైనీలకు ఒక్కొక్కరికి 800 గజాలు, 82 మందికి 200 గజాల వంతున 69,295 గజాల జాగను లే అవుట్ లో కేటాయించింది. వీటిని అతి తక్కువ ధరకే కంపెనీలు కొనుగోలు చేయడం ద్వారా రూ.400 కోట్లు నష్టపోయారు.

బుద్వేలు భూముల కథ

– రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో సర్వే నంబర్లు 282 నుంచి 299 వరకు సుమారు 281 ఎకరాల సీలింగ్ భూములుగా ఉండేవి. వీటిని 1979 లో 66 మంది దళిత రైతులకు అసైన్మెంట్ చేసి లావునీ పట్టాలు ఇచ్చారు.

– ఈ భూములను అసైనీలు సాగు చేయకుండా ఎస్.కె.డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారని, వాటిని ప్లాట్లుగా చేసి విక్రయించారని.. ఇది అసైన్మెంట్ పట్టా షరతులకు విరుద్ధం.. అంటూ అప్పటి చేవెళ్ల ఆర్డీవో సీలింగ్ చట్టం, 1973 ప్రకారం మెమో నం.డి/5062/1997, తేదీ.17.04.1998 రోజున అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు.

– ఆర్డీవో ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసైనీలు హైకోర్టుకు ఆశ్రయించారు. తమ భూములను ఎవరికీ అమ్మలేదని, తామే సాగు చేసుకుంటున్నామన్నారు. ఆర్డీవో తమకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా పట్టాలు రద్దు చేశారని హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాలు విన్న హైకోర్టు ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేసింది. అందరికీ అవకాశం ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

– హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి డి/3301/2000 తేదీ.15.11.2002 ద్వారా అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. ఆ భూమిని ఖాళీ చేయించాలని తహశీల్దార్ ని ఆదేశించారు.

– రెండోసారి కూడా ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసైనీలు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. లావునీ పట్టా షరతులను ఉల్లంఘించారని ఆర్డీవో రుజువు చేయలేకపోయారు. దాంతో మరోసారి ఆర్డీవో ఉత్తర్వులను రద్దు చేసింది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ అసైన్మెంట్ పట్టాలు రద్దు చేసినందుకు రూ.2500 జరిమానా కూడా విధించింది. రెవెన్యూ అధికారుకు చట్టాలపై శిక్షణ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గెలిచినా.. మోసమే

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అసైనీలు భూములను కాపాడుకున్నారు. కానీ ప్రభుత్వం ఆ భూములను అప్పటికే హెచ్ఎండీఏ, టూరిజం శాఖకు కేటాయించింది. కోర్టు తీర్పు అసైనీలకు అనుకూలంగా వచ్చింది. ఐతే కొందరు మధ్యవర్తులు తాము ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి ఈ భూమిని లే అవుట్ చేయిస్తామని, అందులో కొన్ని ప్లాట్లు మీకు ప్రభుత్వం ఇస్తుందని అసైనీలకు చెప్పారు. ఇక్కడే కుట్రలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, మధ్యవర్తుల ద్వారా అసైనీలను బెదిరించి వారికి ఒక్కొక్కరికి 800 గజాల వంతున ప్లాట్లు ఇస్తామని, అవి తిరిగి తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఏరియాలో గజం రూ.లక్ష పలుకుతుంది. కానీ మాండ్ర శివానందరెడ్డి కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏ అండ్ యు ఇన్ఫ్రా పార్కు ప్రైవేటు లిమిటెడ్, వెస్సెల్లా గ్రీన్స్ అనే కంపెనీలు అసైనీలకు తహశీల్దార్ కన్వెయన్స్ డీడ్స్ చేసిన రోజునే వారి నుంచి సేల్ డీడ్ చేయించుకున్నారు. అది కూడా కేవలం గజం ధర రూ.10,200 లకే అసైనీల నుంచి 800 గజాల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

సీలింగ్ చట్టం ఏం చెబుతుంది?

- సెక్షన్ 14(1) ప్రకారం సర్ ప్లస్ ల్యాండ్స్ ని వ్యవసాయ కూలీలకు, కుల వృత్తిదారులకు, పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వొచ్చు. ఇందులో సగం వరకు ఎస్సీ, ఎస్టీలకు, సగం మిగతా వారికి కేటాయించాలి. అందులోనూ మూడింట రెండొంతులు బీసాలకు కేటాయించాలి.

- సెక్షన్ 14(2) ప్రకారం ఇండ్ల స్థలాల కింద ఉచితంగా ఇవ్వాలి.

- సెక్షన్ 14(4) ప్రకారం సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీజ్ వంటివి కుదరవు.

- సెక్షన్ 14(6)(2) ప్రకారం ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాలి. 3 ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి. లేదా అమ్మాలి.

- వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీలింగ్ భూములను స్పెషల్ ఎకనామిక్ జోన్లకు వినియోగించుకోవచ్చునని చట్ట సవరణ చేశారు. అంతే తప్ప రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మొచ్చునని మాత్రం కాదు.

అసైనీలకు తిరిగి ఇప్పించాలి: న్యాయవాది గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, అసైన్డ్ భూములకు శాశ్వత హక్కుల సాధన సమితి అధ్యక్షుడు

అసైనీల నుంచి పథకం ప్రకారమే అగ్గువ ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీలు దక్కించుకున్నాయి. దీనిపై పూర్తి విచారణ చేయాలని, అసైనీలకు ఆ ప్లాట్లు తిరిగి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మధ్యవర్తులతో చేతులు కలిపి అసైనీలకు అన్యాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీవోటీ చట్టం, 1977 కు సవరణ చేసి అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి. స్వేచ్చగా అమ్ముకునే హక్కులు కల్పించాలి. అప్పుడే వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారు.






Advertisement

Next Story

Most Viewed