Revanth Reddy: తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-09-11 07:09:41.0  )
Revanth Reddy: తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో / డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు శుభవార్త చెప్పారు. సైనిక్ స్కూల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్ ను రాబోయే రెండేళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. దీనిని దేశంలోనే అద్భుతంగా తీర్చిదిద్దుతామని పోలీస్ స్కూల్ ఏర్పాటు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఇదే వేదిక నుంచి డీజీపీకి ఆదేశాలిస్తున్నాన్నారు. బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమిలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నాకు వారి బాధలు తెలుసని సీఎం చెప్పారు. డిపార్ట్మెంట్ లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నారు.

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఉండకూడదని, కానీ కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరిన వారు ఈ వ్యసనాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మీ అందరిని చూస్తుంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓ పక్క ఉద్యోగాల భర్తీ చేపడుతూనే మరో పక్క పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కుల వృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం చేస్తున్నాం. 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. కేవలం 27 రోజుల్లో రూ.18 వేల కోట్లతో పంట రుణాలు మాఫీ చేశామన్నారు. 22, 22,687 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ చేశామన్నారు. ఇది దేశచరిత్రలోనే తొలిసారి జరిగిందన్నారు. కడుపుకట్టుకుని నిధులు సేకరిచి రైతన్నల కళ్లను ఆనందం నింపామన్నారు. వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనేలా చేసి రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

అలా అయితే సీఎంగా నేను విఫలమైనట్లే..

ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించడమే హైడ్రా స్పెషల్ టాస్క్ అని, చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణలకు పాల్పడిన వారు మీకు మీరే వదిలేసి గౌరవంగా పక్కకు తప్పుకోవాలని లేకుంటే ఉన్నపళంగా నేలకూలుస్తామన్నారు. ఒక వేళ కూల్చివేతలపై తాత్కాలికంగా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. మేము కోర్టుల్లో కొట్లాడి మీ ఆక్రమణలను తొలగించడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్లో మేము విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే హైడ్రా పేరుతో నేలకూలుస్తున్నారు.. రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందంటూ కొందరు మాట్లాడుతున్నారని.. కానీ హైదరాబాద్ మహా నగరం దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు. వారు ఫామ్ హౌస్ లు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ వారి డ్రైనేజ్ ను గండిపేట నీళ్లలో కలుపుతున్నారు. బలిసినోడి డ్రైనేజీ నీళ్లు గండిపేటలో కలుస్తుంటే ఆ నీటిని నగర ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్లేనన్నారు.

భవిష్యత్ తరాలకు అందించాల్సిన చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీళ్లన్నీ బస్తీల్లోని పేదలు అనాథలుగా రోడ్లపైకి రావాల్సి వస్తోంది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లే వరదలు వస్తున్నాయన్నారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబట్టి అవసరమైతే వారిని చెరసాలలో బంధించడమే నా ప్రభుత్వ విధానం అన్నారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ రివర్ డెవలప్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అక్కడ పేదవారికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తాం. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారుల పట్ల ఈ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుందని, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పునరావాసం కల్పిస్తామన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ ఏడాది లోపు మరో 30 వేల ఉద్యోగాలు:

నిరుద్యోగుల అసంతృప్తితోనే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిందన్న ముఖ్యమంత్రి ప్రజల అవసరాలు తీర్చే విధంగా కాంగ్రెస్ పాలన అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 30 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని ఈ ఏడాది చివరి నాటికి గ్రూప్-1,2,3, డీఎస్సీ, పారామెడికల్ సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చి మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, గత బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నాపత్రాలు పరీక్ష సెంటర్లకు బదులు జీరాక్స్ సెంటర్లలో దర్శనం ఇచ్చేవని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామన్నారు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. గతంలో ఉద్యోగాల కోసం కదం తొక్కిన నిరుద్యోగులు ఇవాళ పోటీ పరీక్షలకు ఉత్సాహంతో సన్నద్ధం అవుతున్నదన్నారు. పోలీసు ఉద్యోగం ఇది ఉద్యోగం మాత్రమే కాదు ఇది ఓ భావోద్వేగం అన్నారు. ఏ సమస్య వచ్చినా బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అన్నారు.

మహిళా ఎస్ఐ పల్లి భాగ్యశ్రీకి సీఎం అభినందన..

పోలీసులంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించాలన్నారు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవశ్యం అన్నారు. ఇవాళ్టి పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్ఐ పల్లి భాగ్య శ్రీ వ్యవహరించగా ఆమెను సీఎం అభినందించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మూడు సార్లు ఎస్ఐ ల భర్తీ జరగ్గా ఇవాళ జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ మూడో బ్యాచ్ కు సంబంధించినది. ఈ బ్యాచ్ లో మొత్తం 547 మంది ఎస్ ఐ లు ట్రైనింగ్ పూర్తి చేసుకోగా వీరిలో 145 మంది మహిళా ఎస్ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 401 మంది సివిల్ ఎస్ఐలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed