పంచాయతీ సెక్రటరీల క్రమబద్ధీకరణ? మూడేండ్ల ప్రొబేషన్ పూర్తయినవారికే ఛాన్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-21 03:23:44.0  )
పంచాయతీ సెక్రటరీల క్రమబద్ధీకరణ? మూడేండ్ల ప్రొబేషన్ పూర్తయినవారికే ఛాన్స్!
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ఫైలుకు కదలిక మొదలైంది. మూడేండ్ల పాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారి సర్వీసును రెగ్యులర్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. పంచాయతీ కార్యదర్శులను నియమించిన సమయంలోనే మూడేండ్ల నిబంధనపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

ఈ మూడేళ్ల కాలంలో వారికి కేటాయించిన గ్రామాల్లో హరితహారం స్కీమ్‌లో భాగంగా 100 శాతం మొక్కలను పరిరక్షించడంతోపాటు అప్పగించిన గ్రామాభివృద్ధి పనులను పూర్తి చేసిన పనితీరును పరిగణనలోకి తీసుకుంటున్నది. మూడేండ్ల కాంట్రాక్ట్ కాలం నిబంధన ప్రకారం 2019 ఏప్రిల్ నాటికే వారి ప్రొబేషనరీ గడువు ముగిసింది. అప్పటి నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

వెంటనే రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలున్నాయని చాలా మంది కార్యదర్శులు ఆశించారు. కానీ ప్రభుత్వం దానికి బదులుగా జీతాలను మాత్రమే పెంచి సరిపెట్టింది. కాంట్రాక్టు కాలాన్ని మరోసారి పొడిగించింది. తాజాగా రెగ్యులరైజేషన్ చేయాలనే ప్రయత్నం మొదలైంది. దానికి సంబంధించిన ఫైలు డిపార్టుమెంట్లలో వివిధ సెక్షన్లకు తిరుగుతూ ఉన్నది. దీంతో పంచాయతీ కార్యదర్శుల్లో సంతృప్తి వ్యక్తమైంది.

జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామకమైనవారికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను తట్టుకోలేక చాలా మంది మధ్యలోనే పని మానేసి వెళ్ళిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8000 మందికి పైగా మందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం నియమించింది. ఉద్యోగాలను వదిలిపెట్టి వారంతట వారే వెళ్లిపోయారు తప్ప ప్రభుత్వం ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని ఆ శాఖ అదికారులు వ్యాఖ్యానించారు.

దీంతో ప్రస్తుతం కార్యదర్శులుగా కొనసాగుతున్న వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాగా పనిచేసి నిలదొక్కకున్నట్లుగానే ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాతిపదికన ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారందరికీ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పంచాయతీ కార్యదర్శులుగా నియమితులైనవారికి మాత్రం రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

మూడేండ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల సమాచారం మాత్రమే పంపాలంటూ సంబంధిత పంచాయతీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు పంపారు. వీరి రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపాలని కోరారు. ఇందుకోసం వారం రోజుల గడువునిచ్చారు.

ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ అధికార యంత్రాంగం ఆ సమాచారాన్ని పంపడంలో నిమగ్నమైంది. పంచాయతీ శాఖలో పనిచేస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పిన సమాచారం మేరకు జిల్లాల నుంచి సమాచారం రాష్ట్రానికి చేరిన వెంటనే ప్రభుత్వం వీరి సర్వీసును రెగ్యులరైజ్ చేస్తుందని తెలిపారు. కొద్దిమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో వారిని కూడా రెగ్యులర్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Also Read...

రెగ్యులరైజేషన్‌కు బ్రేక్! అప్పుడే అనౌన్స్ చేయాలని సర్కారు ప్లాన్?

Advertisement

Next Story

Most Viewed