- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్యా నాయక్ VS సత్యవతి రాథోడ్.. ఆ విషయంలో ఇద్దరూ తగ్గేదేలే..!
దిశ, వరంగల్ బ్యూరో/ డోర్నకల్ : మాజీ మంత్రి, డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ప్రస్తుత మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య టికెట్ పోరు సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రెడ్యానాయక్ పనిచేయగా.. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ అదే శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే తాను డోర్నకల్ నుంచే పోటీ చేస్తానని చెప్పిన మంత్రి సత్యవతి రాథోడ్ టికెట్ రేసులో ఉన్నట్లుగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ పరిణామాల్ని తీవ్రంగా పరిగణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మరుసటి రోజు నుంచే ఇక చివరిసారిగా తనను గెలిపించాలని ఆత్మీయ సమ్మేళనాల వేదికగా ఏకంగా ప్రచారమే మొదలెట్టడం విశేషం.
పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇవ్వబోతోందన్న ధీమాలో రెడ్యా ఉండడం గమనార్హం. అయితే ఈ సారి రెడ్యాను పక్కన పెట్టడం ఖాయమని, డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతిరాథోడ్ నిలదొక్కుకోవాలనే దీర్ఘకాలిక ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, ఆ తర్వాత మంత్రిని చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. రెడ్యాపై కనిపించని వ్యతిరేకత దాగుందని, ఆ విషయం పార్టీ అధిష్ఠానికి తెలిసిపోయిందని గుర్తు చేస్తుండడం గమనార్హం. ఆయన వయస్సును కూడా పరిగణలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
హీటెక్కిన డోర్నకల్..!
రెడ్యా, సత్యవతిలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించినా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎవరికివారు తామేమీ తక్కువ కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు ఆరంభించారు. మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్ ఆశిస్తుండడంతో వీరిమధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన డోర్నకల్ రాజకీయ వేదికపై సత్యవతిరాథోడ్‌కు రెడ్యానాయక్ మధ్య రాజకీయ పోరు మూడు దశాబ్ధాలుగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు అధికార పార్టీలో ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడంలేదు. రాష్ట్ర స్త్రీ, శిశు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మధ్య అధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి ఏడుసార్లు ఎన్నికలు జరుగగా ఆరు సార్లు రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు 1989, 2009, 2014లో సత్యవతి రాథోడ్‌తో రెడ్యానాయక్ తలపడ్డారు. ఒక్కసారి మాత్రమే 2009లో సత్యవతి గెలవగా మిగతా రెండు సార్లు రెడ్యా విజయం సాధించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013లో టీఆర్ఎస్‌లో చేరి 2014లో ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్‌పై పోటీచేశారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యానాయక్ జయకేతనం ఎగురవేసి తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రెడ్యానాయక్ పోటీ చేసి గెలుపొందగా టిక్కెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు.ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్‌లో చోటు కల్పించారు.అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.
పోటీచేస్తానన్న మంత్రి .. గుంటనక్కల ఎదురు చూపులన్న రెడ్యా
డోర్నకల్ నియోజకవర్గం మీద మంత్రి సత్యవతి రాథోడ్, ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇటీవల చేసిన కామెంట్స్ బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు నేతలు డోర్నకల్‌లో సీటు కోసం వేస్తున్న ఎత్తులతో డోర్నకల్ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. అధిష్ఠానం ఆదేశాలు జారీ చేస్తే డోర్నకల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమంటూ మంత్రి సత్యవతి ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించడం రచ్చకు దారి తీసింది. డోర్నకల్ సీటు కోసం గుంట నక్కలు కాసుకొని కూర్చున్నాయంటూ సత్యవతిని ఉద్దేశించి రెడ్యానాయక్ ఆత్మీయ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నన్ను ఓడించాలని కుట్రలు జరుగుతున్నాయని, అయినా మీ అభిమానంతో తానే గెలుస్తానంటూ ఆత్మీయ సమ్మేళనంలో అన్నారు. ఈ వ్యాఖ్యలతో నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోగా ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే, మొదటికే మోసం వస్తుందోమోనన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.