సెక్రటేరియట్‌లో ఎలుకల బెడద.. ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్!

by Disha Web Desk 4 |
సెక్రటేరియట్‌లో ఎలుకల బెడద..  ఫైళ్లు కొరికేస్తాయని ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రారంభమై ఏడాది గడవక ముందే కొత్త సెక్రటేరియట్‌లో ఎలుకలు సంచరిస్తున్నాయి. చైర్లు, టేబుళ్లు, సోఫాల కింద, బీరువాల్లోనూ తిరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లను ఎక్కడ కొరికేస్తాయోననే టెన్షన్ వారిలో నెలకొన్నది. కొత్తగా నిర్మించిన భవనంలోకి ఎలుకలు లోపలికి ఎలా వచ్చాయనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది. ఎలుకలను నివారించేందుకు కొన్ని గదుల్లో బోన్లను ఏర్పాటు చేయగా.. మరికొన్నింటిలో మందు పెడుతున్నారు.

ఫైళ్ల సేఫ్టీ ఎలా?

పైకి మాత్రం చూపరులను ఆకట్టుకునేలా సెక్రటేరియట్‌ను నిర్మించారని, కానీ లోపల మాత్రం లోపాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరుకైన గదులు, వెంటిలేషన్ సమస్యలు, ఫైళ్లు పెట్టేందుకు ర్యాకుల వంటి వసతి లేకపోవడంతో ఉద్యోగులు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు తోడు కొత్తగా ఎలుకల బెడత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎటు చూసినా ఎలుకలే కనిపిస్తున్నాయి. ఫైళ్లను కొరుకేస్తాయేమోనని భయంగా ఉన్నది. కొత్తగా ర్యాకులు ఇవ్వలేదు. బీఆర్కే నుంచి తెచ్చుకున్న బీరువాల్లోనే ఫైళ్లను పెడుతున్నాం. అందులోకి ఎలుకలు దూరుతున్నాయి.’ అని జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి సెక్రటేరియట్‌లోని పరిస్థితులను వివరించారు. ‘మా చాంబర్‌లో ఉదయం నుంచి మేం తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు ఎలుకలు అటూ ఇటూ తిరుగుతాయి. చాలా సార్లు కాళ్ల మధ్య నుంచి దూరిపోతుంటాయి.’ అని ఓ లేడీ సెక్షన్ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బోన్లు ఏర్పాటు

ఎలుకల బెడదను తగ్గించేందుకు కొందరు ఉద్యోగులు తమ చాంబర్‌లో బోన్లను ఏర్పాటు చేసుకున్నారు. ఎలుకల మందును ఉపయోగిస్తున్నారు. ‘ప్రతి రోజూ ఐదారు ఎలుకలు బోన్‌లో పడుతున్నాయి.’ అని మూడో అంతస్తులో ఓ సెక్షన్‌లో పనిచేసే అటెండర్ వివరించారు. ‘చాలా సార్లు కంప్లయింట్ ఇచ్చినం. కానీ జీఏడీ వాళ్లు ఏం పట్టించుకోవట్లేదు. ఇలాగే వదిలేస్తే, ఎలుకల కొంప అవతది’ అని సదరు అటెండర్ కామెంట్ చేశారు. కొత్త బిల్డింగ్‌లోకి ఎలుకలు ఎలా వచ్చాయి? ప్రారంభానికి ముందే ఉన్నాయా? లేక బీఆర్కే నుంచి ఫైల్స్ తెస్తుండగా వాటితో పాటే వచ్చాయా? అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

ఏడాది కూడా పూర్తవలే..

గతేడాది ఏప్రిల్ 30న సెక్రటేరియట్ కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ భవనం వేదికగానే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తికాలేదు. గ్లోబ్ కింద నిర్మించిన 10, 11, 12 అంతస్తుల్లో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సెక్రటేరియట్ బయట నిర్మించిన క్యాంటిన్‌లో కిచెన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ లేకుండానే కాంట్రాక్టు సంస్థ చాలా పనులు చేసింది. వీటన్నింటికి కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇష్టానుసారంగా చేసిన పనులకు తామేందుకు బిల్లులు చెల్లించాలని సర్కారు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed