సర్కార్ స్థలాలకు రక్షణేది..? శంషాబాద్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణ

by Shiva |
సర్కార్ స్థలాలకు రక్షణేది..? శంషాబాద్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణ
X

దిశ, శంషాబాద్: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే కబ్జారాయుళ్లకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంకరపురం గ్రామంలోని సర్వే నంబర్ 24లో దాదాపు 50 ఎకరాల లావాణి పట్టా భూములున్నాయి. వీటిలో 24 సర్వే నంబర్‌లో 10 దళిత కుటుంబాకులకు 20 ఎకరాల లావాణి పట్టాలు ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. మీ దగ్గర ఉన్న ప్రభుత్వ భూమి లావాణి పట్టాలను ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి నమ్మబలికి వారికి ఎంతో కొంత ఇచ్చి లావాణి పట్టా భూములను కొనుగోలు చేశారు. 20 ఎకరాల ప్రభుత్వ భూమికి యథేచ్ఛగా ప్రహరీ నిర్మించి వెంచర్ నిర్మానానికి ఏర్పాటు చేశారు. దానికి వెళ్లడానికి రోడ్డు కూడా ప్రభుత్వ భూమి నుంచి వేశారు. చుట్టుపక్కల ఉన్న రైతులు తమ పొలాల నుంచి రోడ్డు వేయొద్దని చూడకుండా, వారిని పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణం చేసి విద్యుత్ స్తంభాలు కూడా వేశాడు.

నిషేధిత జాబితాలో రిజిస్ట్రేషన్లు..

గత నవంబర్ నెలలో యథేచ్ఛగా నిషేధిత జాబితాలో ఉన్న శంకరపురం భూములను రిజిస్ట్రేషన్లు చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రెవెన్యూ అధికారులే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండదండలుగా నిలవడంతో తమను అడిగే నాథుడే లేడనేలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ప్రభుత్వ భూమి కడప జిల్లా కార్యాలయంలో కూర్చొని దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సామాన్యులు ఇల్లు కట్టడానికి స్థలంలో గుడిసె వేసుకుంటేనే రెవెన్యూ అధికారులు వెళ్లి కూల్చివేస్తారు. కానీ కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమిస్తే అక్కడ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు, ఈ నిబంధనలు పేదవారికేనా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వర్తించవా? అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు..

శంషాబాద్ మండలంలోని 27 గ్రామపంచాయతీల్లో పెద్ద తుప్పర, ముచ్చింతల్ గ్రామపంచాయతీలు మినహా మిగిలిన 25 గ్రామపంచాయతీలు 111 జీవో పరిధిలోనే ఉన్నాయి. ఈ జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే శంకరాపురం గ్రామపంచాయతీ పరిధిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, ప్రహరీలు, రోడ్లు వేస్తున్నా పంచాయతీ అధికారులకు కనిపించడం లేదా? అన్న విమర్శలున్నాయి. ఇప్పటివరకు 111 జీవోకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలకు గ్రామపంచాయతీ తరపున ఒక నోటీసు కూడా ఇవ్వలేదంటే వారికి అధికారుల అండదండలు ఎంత పుష్కలంగా ఉన్నయో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల రైతు ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంకరపూర్ గ్రామానికి చెందిన చెన్నకేశవ కమలమ్మ, చెన్నకేశవ లక్ష్మయ్య దంపతులకు ఘాన్సిమియాగూడ రెవెన్యూ పరిధిలో 8 ఎకరాల భూమి ఉంది. వారికి గతంలో పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ధరణి వచ్చినా తర్వాత గత నవంబర్ ఐదో తేదీ వరకు ధరణిలో కూడా వారి పేరు వస్తుంది. నవంబర్ ఆరో తేదీన శంషాబాద్ తహశీల్దార్ నాగమణి తమ భూమి ధరల్లో లేకుండా డిలీట్ చేసిందని రైతులు ఆరోపించారు. 9 నెలలు జరిగిన తమ భూమి తమ పేరిట చేయలేదని నివసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట గత బుధవారం వారి కొడుకు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటుకుందని స్థానిక రైతులు వాపోతున్నారు.

50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన దళితులకు మరి కొంతమంది పేదవారికి లావాణి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిందని, వాటిని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం కొందరు వచ్చి కొంతమంది రైతులను బెదిరించారని మీరు భూములు అమ్మకుంటే ప్రభుత్వం వాపస్ తీసుకుంటుందని బెదిరించి వారికి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి భూములను కబ్జా చేశారన్నారు. రెవెన్యూ అధికారులకు చెప్పిన పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ భూమి నుంచి రోడ్డు వేసి వెంచర్ చేస్తున్నారని వారిని అడిగితే, అధికారులతో, పోలీసులతో బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story