ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల​ వెరిఫికేషన్​

by Sridhar Babu |
ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల​ వెరిఫికేషన్​
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే 11వేల టీచర్​ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ జారీ చేసింది. నోటిఫికేషన్​ కు అనుగుణంగా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. డీఎస్సీ అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జాబితాను బహిర్గతం చేశారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీలనుబట్టి ఒక్కో ఉద్యోగానికి ముగ్గురు చొప్పున సర్టిఫికెట్ల​ వెరిఫికేషన్​కు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

రంగారెడ్డి జిల్లాలో 379 పోస్టులకు 1137, వికారాబాద్​ జిల్లాలో 359 పోస్టులకు 1077 మంది అభ్యర్థులకు మోబైల్​, మెయిల్​ ద్వారా మేసేజ్​లు పంపారు. అయినా స్పందించకుంటే కాల్​ చేసి సమాచారం ఇచ్చారు. నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్​ పేరుతో ప్రత్యేక రిజర్వేషన్​ కేటాయించడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వెరిఫికేషషన్​కు తగ్గిన అభ్యర్థులు...

విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఒక్కో ఫోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికెట్ల​ వెరిఫికేషన్​కు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ ఈనెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. అనంతరం ఈనెల 9వ తేదీన అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

అయితే ఏ కారణంతోనైనా ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచేందుకు అవకాశం లేకుండా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల​ వెరిఫికేషన్​కు పిలిచినట్లు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డిలో 379, వికారాబాద్​లో 359 టీచర్​ ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాలని సూచించింది. అయితే రంగారెడ్డిలో 379 పోస్టులకు 1137 మంది అభ్యర్థులను పిలిస్తే 880, వికారాబాద్​లో 359 పోస్టులకు 1077 మంది అభ్యర్థులకు 830 మంది చొప్పున హాజరైనట్లు జిల్లాల విద్యాశాఖాధికారులు వివరించారు. దీంతో పిలిచిన అభ్యర్థుల్లో సుమారు 200 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్​కు దూరమున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్​ కేటాయింపులో అన్యాయం...

ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్​ విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని స్పష్టమైతుంది. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు రిజర్వేషన్​ కేటాయింపుపై వ్యతిరేకం కాదని, కానీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్​ ప్రక్రియ ఉండాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రభుత్వాలు అంచనాలు వేస్తున్నాయి. రాష్ట్రంలో కూడా నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తే అభ్యంతరాలుండవు. కేవలం రాజకీయ కోణంలోనే అధికార పార్టీలు రిజర్వేషన్​ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో ఈడబ్ల్యూఎస్​ కేటాయించడంతో వారు బీసీలలోని ఏబీసీడీఈ, ఎస్టీల కంటే ఎక్కువ, ఎస్సీలతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.

వీరిదే పైచేయి...?

జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమతున్నాయి. ఈడబ్ల్యూఎస్​ విధానం కేవలం అగ్రవర్ణాలకే కాకుండా అన్ని కులాల్లో ఉన్న వాళ్లకు వర్తింపచేస్తే రిజర్వేషన్లో న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలో కూడా ఎకనామికల్​ వికర్​ సెక్షన్​ అత్యధికంగా ఉన్నారనే వాదన వినిపిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ సమయంలో ఈడబ్ల్యూఎస్​ విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు చెందిన డీఎస్సీ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది.

ఉదాహరణకు... రంగారెడ్డి జిల్లాలో ఎస్​జీటీ తెలుగులో 197 ఖాళీలున్నాయి. ఇందులో ఓసీకి 55, ఎస్సీకి 29, ఎస్టీకి 20, బీసీ ఏకి 14, బీసీ బీకి 18, బీసీ సీకి 7, బీసీ ఈకి 7, వికలాంగులకు 8, ఈడబ్ల్యూఎస్​​కి 19, స్పోర్ట్స్​ కోటాలో 03, ఎక్స్​ సర్వీస్​మెన్​ కింద 4 ఉన్నాయి. వికారాబాద్​ జిల్లాలో ఎస్​జీటీ తెలుగులో 163 ఖాళీలున్నాయి. ఇందులో ఓసీకి 47, ఎస్సీకి 23, ఎస్టీకి 16, బీసీ ఏకి 12, బీసీ బీకి 15, బీసీ సీకి 4, బీసీ డీకి 10, బీసీ ఈకి 6, వికలాంగులకు 7, ఈడబ్ల్యూఎస్​కి 16, స్పోర్ట్స్​ 3, ఎక్స్​ సర్వీస్​మెన్​ కింద 4 చొప్పున రిజర్వేషన్​ కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇందులో జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్​ వాళ్లకే దక్కుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాల్లో ఖాళీల వివరాలు ఇలా....

రంగారెడ్డి జిల్లాలో 379 టీచర్​ ఉద్యోగాల ఖాళీల్లో లాంగ్వేజ్​ పండిట్​ 30, పీఈటీ 6, స్కూల్​ అసిస్టెంట్​ 71, ఎస్​జీటీ 272 ఉన్నాయి. వికారాబాద్​ జిల్లాలో 359 టీచర్​ ఉద్యోగాల ఖాళీల్లో లాంగ్వేజ్ పండిట్​ 23, పీఈటీ 5, స్కూల్​ అసిస్టెంట్​ 108 ఎస్​జీటీ 223 ఖాళీలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed