Manchireddy Kishan Reddy : ఫార్మాసిటీ రద్దుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

by Aamani |   ( Updated:2024-07-31 14:10:49.0  )
Manchireddy Kishan Reddy : ఫార్మాసిటీ రద్దుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి
X

దిశ,ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం రోజున నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని, భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పారు. మీర్ ఖాన్ పేట్ లో నైపుణ్య శిక్షణ కేంద్రం (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) భూమి పూజకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఫార్మాసిటీపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను మభ్య పెట్టే మాటలకు తెరదించాలని సీఎంని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు ఫార్మాసిటీ రద్దుచేసి, భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని అన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, వాళ్ళ హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు, ఎమ్మెల్యే ,వారి నాయకులు నాలుక మడత పెడితే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, మల్ రెడ్డి, కోదండ రెడ్డి, కోదండ రామ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఫార్మాసిటీ రద్దుపై, భూములను తిరిగి రైతులకు ఇవ్వడంపై చేసిన ప్రకటనలను, పాదయాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క, సీతక్క ఫార్మా రైతులకు మద్దతుగా మాట్లాడిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాటలకు కట్టుబడి ఫార్మాసిటీ రద్దుచేసి తిరిగి రైతులకు భూములు ఇవ్వాలని ఈ మేరకు సీఎం రేపటి భూమి పూజలో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు కర్నాటి రమేష్ గౌడ్, చిన్నోళ్ళు జంగమ్మ యాదయ్య, కందుకూరి రామచంద్రయ్య, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు పాశ్చ భాషా, బందే రవి కిరణ్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, భీమ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed