వారికి రాజకీయ సమాధి తప్పదు.. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

by Sumithra |
వారికి రాజకీయ సమాధి తప్పదు.. మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
X

దిశ, యాచారం : కాంగ్రెస్ పార్టీని మోసం చేసినవారికి రాజకీయ సమాధి తప్పదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాచారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలో సోమవారం ఆయన పర్యటించారు. పలుగ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వలాభంతోనే ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు నోట్ల సంచులతో పల్లెలకు బయలుదేరారని తెలిపారు. ఒకరు ఓటుకు రూ.30 వేలు ఇస్తామంటే, మరొకరు రూ. 40 వేలు ఇస్తామని పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజల సొమ్మేనని అన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని హితవు పలికారు. తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఓటు వేయాలని కోరారు. అనంతరం రంగారెడ్డి జన్మదినం సందర్భంగా యాచారం కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాచారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్కు నరసింహ, ప్రధాన కార్యదర్శి వరికుప్పల సుధాకర్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు గులాం అక్బర్, జిల్లా కార్యదర్శి ఉప్పల భాస్కర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరారం వెంకట్ రెడ్డి, ముచ్చర్ల సంపత్, చీర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story